
హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా చురుగ్గా ఉంటాడన్న విషయం తెలిసిందే. దేశంలో జరిగే ప్రతీ విషయంపై సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందిస్తుంటాడు. తాజాగా సెహ్వాగ్ చేసిన పనికి టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సెహ్వాగ్ సైతం పవన్ కల్యాణ్ సినిమాలు ఫాలోఅవుతాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది!. సినిమాల్లో ఆయన చెప్పే డైలాగ్‌లకు అభిమానులే కాదు పలువురు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతుంటారు.ముఖ్యంగా పవన్ చెప్పిన డైలాగ్‌ల్లో 'గబ్బర్‌సింగ్'లోని 'నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదో ఒక సందర్భంలో ప్రతిఒక్కరి నోటి నుంచి సరదాగా ఈ డైలాగ్ రావాల్సిందే! తాజాగా ఈ డైలాగ్‌ను దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్లో చెప్పి అలరించాడు. పవన్ మేనరిజంను అనుసరిస్తూ మెడపై చేతులు పెట్టుకొని సెహ్వాగ్ ఈ డైలాగ్ చెప్పే ప్రయత్నం చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
మొబైల్‌లో పవన్ డైలాగ్ చెబుతున్న వీడియోను చూస్తూ.. పక్కన అమ్మాయి సాయం చేస్తుండగా సెహ్వాగ్ డైలాగ్‌ను పలికిన తీరు ఇరువురు సెలబ్రిటీల అభిమానులను ఫిదా చేస్తోంది. అయితే ఈ వీడియో ఎప్పడిదో అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఇక ఇంగ్లండ్‌పై నాలుగో టెస్ట్‌లో భారత్ విజయం సాధించడంపై వీరేంద్ర సెహ్వాగ్ సంతోషం వ్యక్తం చేశాడు. ట్విటర్ వేదికగా తనదైన శైలిలో స్పందించాడు. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో విమర్శకుల నోళ్లు మూయించాడు. భారత్ టర్నింగ్ ట్రాక్స్‌పైనే విజయం సాధిస్తుందని చెప్పారో.. వాళ్ల ఇప్పుడు సమాధానం చెప్పాలన్నాడు.
యాభై ఏళ్ల తర్వాత ఓవల్‌లో భారత్‌కు టెస్టు విజయం దక్కింది. ఆఖరి రోజు అద్భుతంగా బౌలింగ్ చేసిన టీమ్ ఇండియా నాలుగో టెస్టులో 157 పరుగుల తేడాతో ఆతిథ్యఇంగ్లండ్ను ఓడించింది. 368 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 77/0తో అయిదో రోజు, సోమవారం బరిలోకి దిగినఇంగ్లండ్.. 210 పరుగులకు ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ఆ జట్టు పతనాన్ని శాసించారు. ఓపెనర్లు హమీద్ (63), బర్న్స్ (50) తొలి వికెట్‌కు వంద పరుగులు జోడించినా.. ఆ తర్వాత వచ్చినఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. రోహిత్ శర్మకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. చివరి టెస్టు శుక్రవారం ఆరంభమవుతుంది.
సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 191 ఆలౌట్ (శార్దూల్ ఠాకూర్ 57, కోహ్లీ 50)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290 ఆలౌట్ (ఓలీ పోప్ 81, క్రిస్ వోక్స్ 50
భారత్ రెండో ఇన్నింగ్స్: 466 (రోహిత్ 127, పుజారా 61, శార్దూల్ 60, పంత్ 50)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 210 ఆలౌట్