టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్ వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు గెలిచి ధోనీ సరసన నిలిచాడని కొనియాడాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 9 నెలల క్రితం వెస్టిండీస్ వేదికగా రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమిండియా టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకుంది.
రోహిత్ శర్మ సారథ్యం వల్లే టీమిండియా వరుసగా ఐసీసీ టైటిళ్లు గెలిచిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే సెహ్వాగ్ సైతం రోహిత్ కెప్టెన్సీని కొనియాడాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించిన తీరు అద్భుతమన్నాడు. ఆటగాళ్లతో అతను వ్యవహరించే తీరే సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలబెట్టిందని అభిప్రాయపడ్డాడు.

'ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సారథిగా రోహిత్ శర్మ వ్యవహరించిన తీరు అద్భుతం. చాలా మంది అతని సారథ్యాన్ని తక్కువ అంచనా వేశారు. కానీ అతను వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు గెలిచి తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. రోహిత్ తన బౌలర్లను వినియోగించుకునే తీరు, టీమ్‌ను హ్యాండిల్ చేసే విధానం బాగుంటుంది. బెంచ్ ఆటగాళ్లతో కూడా అతను మాట్లాడే విధానం అద్భుతం.
తొలి మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కు బదులు హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తీని తుది జట్టులోకి తీసుకొచ్చాడు. ఆ సమయంలో తుది జట్టులో ఆడించని ఆటగాళ్లను రోహిత్ సముదాయించిన తీరు అమోఘం. ఇదే రోహిత్ శర్మను అత్యుత్తమ సారథిగా నిలబెట్టింది. వ్యక్తిగతంగా అతని గురించి తక్కువగా ఆలోచిస్తాడు. ఆటగాళ్లను సౌకర్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తాడు. ఆటగాళ్లు అభద్రతాభావంతో ఉంటే సరైన ప్రదర్శన చేయలేరనే విషయం రోహిత్ శర్మకు తెలుసు. అందుకే జట్టులో ఏ ఆటగాడిలోనూ అభద్రతాభావం కనిపించలేదు. ఇలా చేయడం వల్లే రోహిత్ శర్మ కెప్టెన్‌గా సక్సెస్ అయ్యాడు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.