Team India Head Coach: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌తో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవికాలం పూర్తయింది. దాంతో భారత జట్టు నయా కోచ్ ఎవరనే అంశం చర్చనీయాంశమైంది. రవి శాస్త్రి తరహాలో రాహుల్ ద్రవిడ్ పదవి కాలాన్ని పొడిగిస్తారా? లేక కొత్త కోచ్‌ను నియమిస్తారా? అనేది చూడాలి.
ద్రవిడ్ మాత్రం టీమిండియా హెడ్ కోచ్‌గా కొనసాగడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రపంచకప్ ఫైనల్ అనంతరం మీడియా సమావేశంలో తెలిపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ తాత్కలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ద్రవిడ్ తప్పుకున్నా.. తప్పించినా.. టీమిండియా హెడ్ కోచ్ రేసులో లక్ష్మణ్ ముందు వరుసలో ఉండనున్నాడు.

అతనితో పాటు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే కూడా టీమిండియా హెడ్ కోచ్ పదవి స్వీకరించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

1.వీవీఎస్ లక్ష్మణ్..
టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపెట్టేందుకు లక్ష్మణ్ ముందు వరుసలో ఉన్నాడు. ప్రస్తుతం ఎన్‌సీఏ డైరెక్టర్‌గా కొనసాగుతుండటం అతనికి అడ్వాంటేజ్. రాహుల్ ద్రవిడ్ సైతం ఎన్‌సీఏ డైరెక్టర్‌గా సేవలు అందించే టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరించాడు. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా పనిచేయడం వల్ల యువ ఆటగాళ్లతో పాటు జట్టులో ఉన్న ఆటగాళ్ల ఫిట్‌నెస్, ఫామ్‌పై కూడా అవగాహన ఉంటుంది.
ఇక వీవీఎస్ లక్ష్మణ్‌కు కోచ్‌గా చాలా అనుభవం ఉంది. 2013లో అతను కోచింగ్ కెరీర్ ప్రారంభించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటార్‌గా తన కోచింగ్ మొదలుపెట్టాడు. 2021 వరకు మెంటార్‌గా సన్‌రైజర్స్‌కు సేవలు అందించిన లక్ష్మణ్ 2021లో బీసీసీఐ సూచనలతో ఎన్‌సీఏ డైరెక్టర్ పదవిని స్వీకరించాడు.

2. వీరేంద్ర సెహ్వాగ్..
ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు దక్కించుకున్న వీరేంద్ర సెహ్వాగ్ కూడా టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలను స్వీకరించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ప్రస్తుతం అతను ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకోలేదు. హెడ్‌కోచ్‌గా నియమిస్తే సౌతాఫ్రికా సిరీస్‌తోనే బాధ్యతలు స్వీకరిస్తాడు. రిటైర్మెంట్ ప్రకటించిన రెండేళ్ల నుంచే హెడ్ కోచ్‌గా పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు.

3. అనిల్ కుంబ్లే..
అనిల్ కుంబ్లేకు టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అతని పర్యవేక్షణలోనే టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడింది. కానీ ఆటగాళ్ల పట్ల కఠినంగా ఉంటున్నాడని, అతని పర్యవేక్షణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే ఫిర్యాదులు రావడంతో కుంబ్లేను తప్పించారు.