టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కుటుంబం నుంచి మరొకరు ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. కోహ్లీ అన్న వికాస్ కోహ్లీ కుమారుడు ఆర్యవీర్ కోహ్లీ ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్) ఆడేందుకు సిద్దమయ్యాడు. ఆదివారం జరిగిన డీపీఎల్ 2025 వేలంలో ఈ 15 ఏళ్ల లెగ్ స్పిన్నర్‌ను సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ జట్టు రూ. 1 లక్ష రూపాయలకు కొనుగోలు చేసింది. విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ పర్యవేక్షణలోనే ఆర్యవీర్ కోహ్లీ క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. రాజ్‌కుమార్ శర్మకు చెందిన వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.
ఆర్యవీర్ కోహ్లీ ఇప్పటివరకు ఢిల్లీ రాష్ట్ర జట్టు తరపున ఆడలేదు. కానీ ఆ జట్టు తరఫున ఏజ్ క్రికెట్‌లో బరిలోకి దిగాడు. అండర్ 14, 16 టోర్నీల్లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. విరాట్ కోహ్లీతో కలిసి ఆర్యవీర్ ప్రాక్టీస్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఆర్యవీర్ ఎలా ఆడుతాడనేది ఆసక్తికరంగా మారింది. అందరి కళ్లు అతనిపైనే ఉన్నాయి. ఐపీఎల్ స్టార్ ఆయుష్ బదోనీ సారథ్యంలో ఆర్యవీర్ ఆడనున్నాడు.

ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్) వేలంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా పాల్గొన్నాడు. అతన్ని సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రూ. 8 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆర్యవీర్ సెహ్వాగ్.. ఢిల్లీ అండర్ 19 జట్టు తరఫున ఆడాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ కోసం జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే సెహ్వాగ్ చిన్న కొడుకు వేదాంత్ సెహ్వాగ్‌కు మాత్రం ఈ వేలంలో అన్‌సోల్డ్‌గా నిలిచాడు.
ఐపీఎల్ వివాదాస్పద స్పిన్నర్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ దిగ్వేష్ రతి రూ. 38 లక్షలు పలికాడు. అతన్ని ఢిల్లీ సూపర్‌స్టార్జ్ ఐపీఎల్ కంటే ఎక్కువ ధర సొంతం చేసుకోవడం గమనార్హం. ఐపీఎల్ 2025 మెగా వేలంలో దిగ్వేష్ రతిని లక్నో రూ. 30 లక్షల కనీస ధరకు తీసుకుంది. అతను ఈ సీజన్‌లో 14 వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ సిమర్జిత్ సింగ్‌ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రూ.39 లక్షలకు తీసుకోగా.. నితీష్ రాణాను ఢిల్లీ లయన్స్ రూ. 34 లక్షలకు కొనుగోలు చేసింది.