రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన కమర్షియల్ కాంట్రాక్ట్‌పై కోహ్లీ సంతకం చేయలేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఐపీఎల్ ప్లేయర్ కాంట్రాక్ట్, కమర్షియల్ కాంట్రాక్ట్ మధ్య వ్యత్యాసాన్ని వెల్లడిస్తూ కైఫ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో చేశాడు. కోహ్లీ ఎక్కడికి వెళ్లడని, ఆర్‌సీబీలోనే కొనసాగుతాడని స్పష్టం చేశాడు.
'విరాట్ కోహ్లీ ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నాడా? అంటే లేదు ఫ్రెండ్స్. కోహ్లీ తన మొదటి, చివరి మ్యాచ్‌ను బెంగళూరు తరఫున మాత్రమే ఆడుతానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ విషయంలో అతను ఏ మాత్రం వెనక్కితగ్గడు. కానీ ఆర్‌సీబీతో కమర్షియల్ డీల్‌పై కోహ్లీ సంతకం చేయలేదనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే..? ఫ్రాంచైజీతో రెండు ఒప్పందాలు ఉంటాయి. ప్లేయర్‌గా.. కమర్షియల్‌గా ఆటగాళ్లు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆర్‌సీబీ కమర్షియల్ కాంట్రాక్ట్‌పై కోహ్లీ సంతకం చేయకపోవడానికి ఓ కారణం ఉంది. ఆర్‌సీబీకి కొత్త యజమాని వచ్చే అవకాశం ఉంది. కొత్తవారి రాకతో ఫ్రాంచైజీ నిర్ణయాలు మారవచ్చు. అందుకే కోహ్లీ వేచి చూస్తున్నాడు. ఒకవేళ యజమాని మారితే.. కొత్త చర్చలు జరుగుతాయి. ఇవన్నీ తెర వెనుక జరిగే విషయాలు. వీటిపై స్పష్టమైన సమాచారం లేదు. కోహ్లీ కూడా వేచి చూస్తున్నాడు.
కోహ్లీ ఇప్పుడే తన ఆటను తిరిగి మొదలు పెట్టాడు. ఆర్‌సీబీ కూడా ఇప్పుడే టైటిళ్లను గెలవడం ప్రారంభించింది. విరాట్ కోహ్లీ 650+ పరుగులు చేసి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ. అతను ఫామ్‌పై ఎలాంటి సందేహం అక్కర్లేదు. అతని అసలు ఆట ఇప్పుడే మొదలైంది. కోహ్లీ ఎక్కడకు వెళ్లడు. ఆర్‌సీబీ కోసమే ఆడుతాడు. అభిమానులకు మాట ఇచ్చాడు. కాబట్టి ఆ మాట తప్పడు.