ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 183 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీకి తోడుగా కామెరూన్ గ్రీన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), గ్లేన్ మ్యాక్స్‌వెల్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) రాణించారు. చివర్లో దినేశ్ కార్తీక్(8 బంతుల్లో 3 సిక్స్‌లతో 20) మెరుపులు మెరిపించాడు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్ రెండేసి వికెట్లు తీయగా.. సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టాడు.

శుభారంభం లేకున్నా..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. హర్షిత్ రాణా వేసిన రెండో ఓవర్‌లో సిక్సర్ బాది జోరు కనబర్చిన ఫాఫ్ డుప్లెసిస్.. మరుసటి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్‌తో కలిసి కోహ్లీ ధాటిగా ఆడాడు. గ్రీన్ కూడా దూకుడుగా ఆడటంతో ఆర్‌సీబీ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.
చెలరేగిన కోహ్లీ..
రస్సెల్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్(33) ఔటైనా.. మ్యాక్స్‌వెల్ సాయంతో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మ్యాక్స్‌వెల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను డీప్ మిడ్ వికెట్‌లో రమణ్‌దీప్ నేలపాలు చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన మ్యాక్స్‌వెల్.. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మరో క్యాచ్ ఇచ్చాడు. కానీ షార్ట్ థర్డ్ మ్యాన్‌లో నరైన్ నేలపాలు చేశాడు.
కార్తీక్ ఖతర్నాక్ షో..
చివరకు మ్యాక్స్‌వెల్‌ను నరైన్ పెవిలియన్ చేర్చగా.. కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దాంతో ఆర్‌సీబీ పరుగుల వేగం తగ్గింది. రజత్ పటీదార్(3), అనూజ్ రావత్(1) మరోసారి నిరాశపరచగా.. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ చెలరేగాడు. రస్సెల్ వేసిన 19వ ఓవర్‌లో కార్తీక్ 2 సిక్స్‌లు బాదాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఆఖరి ఓవర్‌లో కోహ్లీ, కార్తీక్ చెరో సిక్సర్ బాది భారీ స్కోర్ అందించారు.