Kohli vs Rohit: ఎవడ్రా విభేదాలున్నాయంది? పిక్ ఆఫ్ ద డే! ఫ్యాన్స్ ఫిదా!

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు ఉన్నాయని గతేడాది కాలంగా వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. 2019 వన్డే ప్రపంచకప్ జట్టు ఎంపికలో వీరి మధ్య మొదలైన బేధాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయని కథనాలు వెలువెడ్డాయి. ఆ తర్వాత వీరి మధ్య నెలకొన్న కొన్ని సంఘటనలు ఈ వార్తలు నిజమేనని నమ్మేలా చేశాయి. ముఖ్యంగా ఇన్‌స్టా కోహ్లీని రోహిత్, అతని సతీమణి అన్ ఫాలో చేయడం, ఆ తర్వాత అనుష్క శర్మ వారిని అన్ ఫాలో చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
గతేడాది ఐపీఎల్‌లో..
అంతేకాకుండా గతేడాది ఐపీఎల్ సందర్బంగా ఈ ఇద్దరు ఒకరినొకరు చూసుకోకపోవడం.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే ముందు రోహిత్ శర్మ గాయం గురించి తెలియదని విరాట్ మీడియాకు తెలపడం అనేక ఊహాగానాలకు తెరదీసింది. అయితే ఆ తర్వాత అంతా సెట్ అయినా వీరు కడుపులో కత్తులు పెట్టుకొని మీదికి మంచిగా ప్రవర్తిస్తున్నారని ప్రచారం జరిగింది. రోహిత్ శర్మ కారణంగానే కోహ్లీ టీ20 కెప్టెన్సీ వదులుకున్నాడని, టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్‌ను తప్పించాలని సెలెక్టర్లను విరాట్ కోరాడని కూడా వార్తలు వచ్చాయి.
రోహిత్ గాయంపై కోహ్లీ ఆరా..
అయితే ఆదివారం ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్బంగా చోటు చేసుకున్న ఘటన ఈ వార్తలన్నీ ఊహాజనిత కథనాలేనని స్పష్టం చేస్తోంది. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా గాయపడ్డ రోహిత్ శర్మను మ్యాచ్ అనంతరం కోహ్లీ ప్రత్యేకంగా కలిసాడు. ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి గాయం గురించి ఆరా తీసాడు. కోహ్లీ వస్తుండగా.. రోహిత్ లేచి నిలబడటం.. అతనితో నవ్వుతూ మాట్లాడటం అభిమానులను సంతోషపరిచింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
పిక్ ఆఫ్ ద డే..
పిక్ ఆఫ్ ద డే.. మ్యాచ్ ఓడిపోయిన ఈ ఫొటో సంతోషపరిచిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. విభేదాలున్నాయంది ఎవడ్రా? అంటూ కూడా నీలదీస్తున్నారు. 'రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలు లేవనడానికి ఈ ఫోటోనే నిదర్శనం'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో వీళ్లు మళ్లీ క్లోజ్ అయ్యారనే విషయం స్పష్టమైంది. మ్యాచ్ విజయాలు సాధించినప్పుడు, మైదానంలో వ్యూహాల గురించి చర్చించినప్పుడు ఒకరికొకరు హగ్ చేసుకోవడం వీరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయనిపించింది.

ఆర్‌సీబీ అద్బుత విజయం..
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 55 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 56), విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51) అర్ధ సెంచరీలు సాధించగా, తెలుగు క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ (24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) రాణించాడు. బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ముంబై 18.1 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ (28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 43) ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హర్షల్ పటేల్ (4/17) 'హ్యాట్రిక్'తో చెలరేగగా... చహల్ 3, మ్యాక్స్‌వెల్ 2 వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications