
హైదరాబాద్: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ X పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. మరో 24 గంటల్లో దాయదుల సమరానికి తెరలేవనుంది. ఆసియాకప్‌లో భాగంగా ఇరు జట్లు ఆదివారం జరిగే తమ తొలి మ్యాచ్‌లోనే తలపడనున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా చాలా కాలంగా రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా కప్ లాంటి టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు చివరిసారిగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌పై పాక్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో ఆసియాకప్‌లో పాక్‌ను చిత్తుగా ఓడించి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అంతేకాకుండా గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఈ మ్యాచ్‌తోనే మళ్లీ మైదానంలోకి బరిలోకి దిగుతున్నాడు. దాంతో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీకి ఘనమైన రికార్డు ఉండటం ఈ అంచనాలకు బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా ఓ రికార్డు అయితే కోహ్లీ ఫ్యాన్స్‌కు ఆశలు రేకెత్తిస్తోంది. ఆ రికార్డు ఏంటంటే...? టీ20ల్లో ఇరు జట్లు మొత్తం తొమ్మిది మ్యాచ్ ఆడగా.. భారత్ 7 మ్యాచ్‌లు నెగ్గింది. అయితే ఈ 9 మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీనే ఐదు సార్లు భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. అంతేకాకుండా ఇందులో విరాట్ ఆడింది కేవలం ఏడు ఇన్నింగ్స్‌లు మాత్రమే.
గతేడాది టీ20 ప్రపంచకప్‌లోనూ టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన వేళ విరాట్ తీవ్ర ఒత్తిడిలో హాఫ్ సెంచరీతో రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. కానీ ఆ మ్యాచ్‌లో భారత్ గెలవలేకపోయింది.ఈ క్రమంలోనే రేపు జరిగే మ్యాచ్‌లోనూ విరాట్ దుమ్మురేపుతాడని అతని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. పాకిస్థాన్‌పై విజయం సాధించాలంటే విరాట్ కోహ్లీ రాణించడం చాలా కీలకం. కోహ్లీ సైతం కసితో సాధన చేస్తున్నాడు. ఫామ్‌లోకి వచ్చేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అప్‌డేటేడ్ షాట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. స్విచ్ హిట్స్, రివర్స్ స్వీప్ ఆడటంపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఇక పాక్‌తో ఆడబోయే ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి కెరీర్‌లో 100వ టీ20 కావడం విశేషం. పొట్టి ఫార్మాట్‌లో 137.66 స్ట్రైక్ రేట్‌తో 3308 పరుగులు చేసిన విరాట్.. మైలు రాయి మ్యాచ్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటంపై దృష్టి పెట్టాడు.