
దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి కాబోతున్నాడు. ఈ శుభవార్తను అతనే వెల్లడించాడు. తన సతీమణి, బాలీవుడ్ హీరోయిన అనుష్క శర్మ గర్భం దాల్చినట్లు విరాట్ ట్విటర్ వేదికగా స్పష్టం చేశాడు. 'జనవరి 2021లో మేం ముగ్గురం కాబోతున్నాం'అనే క్యాప్షన్‌తో అనుష్కశర్మతో ఉన్న ఫొటోను విరాట్ షేర్ చేశాడు. ఈ ట్వీట్‌ను బట్టి చూస్తే ప్రస్తుతం అనుష్కకు 5వ నెల అని తెలుస్తోంది. ఈ వార్తతో విరాట్ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. విరాట్-అనుష్క జోడీకి అభినందనలు తెలుపుతున్నారు. ఇక అనుష్క కూడా తన ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది.
తమ కెరీర్‌ల నేపథ్యంలో ఎప్పుడూ బిజీగా ఉండే విరుష్క జోడీకి కరోనా టైమ్ కలిసొచ్చింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా సుమారు 5 నెలల పాటు ఇంటికే పరిమితమయ్యారు. ఓవైపు సినిమా షూటింగ్‌లు జరగక అనుష్కా.. మరోవైపు క్రికెట్ టోర్నీల్లేక విరాట్ ఈ ఊహించని విరామాన్ని ఆస్వాదించారు. సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పటికప్పుడూ టచ్‌లో ఉంటూ కరోనా కట్టడికి కృషి చేశారు. భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు.
ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ కోసం కోహ్లీ సిద్దమవుతుండగా... అనుష్క శర్మ కూడా అతనితో పాటే దుబాయ్ వెళ్లింది. ఈ కారణంగానే విరాట్ జట్టుతో కాకుండా ప్రత్యేక విమానంలో దుబాయ్‌కు వచ్చినట్లు అర్థమవుతుంది. ఇక పెళ్లైన భారత ఆటగాళ్లంతా ఇప్పటికే తండ్రులైన విషయం తెలిసిందే. ఇటీవలే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బాబు పుట్టగా.. సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడికి కూతురు జన్మించింది.
ఇక విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టు ట్రెయినింగ్ క్యాంప్ గురువారం నుంచి మొదలు కానుంది. ఆర్‌సీబీ టీమ్ ఆరు రోజుల తప్పనిసరి క్వారంటైన్ బుధవారంతో ముగియనుంది. దీంతో జట్టు మొత్తం మూడు వారాల ట్రెయినింగ్ క్యాంప్‌లో పాల్గొననుంది. ఐసీసీ క్రికెట్ అకాడమీలో జరిగే ఈ క్యాంప్ పూర్తి బయోసెక్యూర్ వాతావరణంలో జరగనుంది. ఈ క్యాంప్ కోసం ఆర్‌సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్స్ మైక్ హెస్సన్, హెడ్‌కోచ్ సైమన్ కటిచ్ ఇప్పటికే ప్లాన్స్ రెడీ చేశారు.