ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్‌లో అడుగుపెట్టాడు. మంగళవారం కింగ్ కోహ్లీ న్యూఢిల్లీకి చేరుకున్నాడు. టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ అనంతరం లండన్ వెళ్లిపోయిన కోహ్లీ.. అక్కడే ఫ్యామిలీతో నివాసం ఉంటున్నాడు. వ్యక్తిగత జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, తన పిల్లలు ఎలాంటి స్టార్‌డమ్ లేకుండా స్వేచ్ఛగా పెరగాలనే ఉద్దేశంతో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ.. ఐపీఎల్ 2025 సీజన్ సమయంలో టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కుటుంబానికి సమయం కేటాయించేందుకే కోహ్లీ రిటైర్మెంట్ తీసుకున్నాడని, అనుష్క శర్మ కారణంగానే రెండు ఫార్మాట్లకు వీడ్కోలు పలకాడనే ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతం కోహ్లీ వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఈ సిరీస్ ఆడేందుకు విరాట్ కోహ్లీ మంగళవారం భారత్‌కు వచ్చాడు. బ్లాక్ షర్ట్, వైట్ ట్రూజర్‌లో బాలీవుడ్ హీరోను తలపించిన కోహ్లీ..సెక్యూరిటీ మధ్య ఎయిర్ పోర్ట్ బయటకు వచ్చి కారులో వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కోహ్లీ రాకతో అతని అభిమానులు పులకించుపోతున్నారు. 'అన్న వచ్చినాడు రోయ్..!'అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే తొలి బ్యాచ్ ఆటగాళ్లు బుధవారం సాయంత్రం ఫ్లైట్ ఎక్కనున్నారు. విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ తొలి బ్యాచ్‌తోనే ఆసీస్‌కు వెళ్లనున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాను శుభ్‌మన్ గిల్ నడిపించనున్నాడు. అతని సారథ్యంలోనే రోహిత్, కోహ్లీ బరిలోకి దిగనున్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ, రోహిత్‌ల అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. వెస్టిండీస్‌తో విజయానంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్‌ను కోహ్లీ, రోహిత్ భవితవ్యంపై ప్రశ్నించగా ఆసక్తికర విషయాలు చెప్పాడు. 'కోహ్లీ, రోహిత్ నాణ్యమైన ఆటగాళ్లు. వారు జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నారు. వారి అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీకి ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. ప్రస్తుత కాలంలో ఉండటం ముఖ్యం. రోహిత్, కోహ్లీ ఇద్దరూ నాణ్యమైన ఆటగాళ్లే. ఆస్ట్రేలియా పర్యటనలో వారు బాగా రాణిస్తారని ఆశిస్తున్నా.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.