
ముంబై: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. 69/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు 61 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన మయాంక్ అగర్వాల్ ( 108 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 62), చతేశ్వర్ పుజారా (97 బంతుల్లో 6 ఫోర్లు,సిక్స్‌తో 47) తొలి వికెట్‌కు 107 పరుగుల సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పగా.. ఆజాజ్ పటేల్ స్వల్ప వ్యవధిలో వీరిద్దర్నీ మరోసారి పెవిలియన్‌కు పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ నిదానంగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.
దాంతో భారత్ 142/2 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం మరింత నిలకడగా ఆడిన ఈ జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఇక క్రీజులో కుదురుకున్న ఈ జోడీని రచిన్ రవీంద్ర విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన శుభ్‌మన్ గిల్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.