
బౌలర్లు సూపర్
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మేము అనుకున్న విధంగా ఆడాం. మా బౌలర్లు చివరి ఐదు ఓవర్లలో కేవలం 34 పరుగులు మాత్రమే ఇవ్వడం ప్రశంసించదగ్గ విషయం. ఎందుకంటే.. ఇంగ్లండ్‌లో హిట్టర్స్ ఎక్కువగా ఉన్నారు. సుందర్ బాగా బౌలింగ్ చేశాడు. భువీ, ఠాకూర్, చహల్ అద్భుత బంతులు వేశారు. మొత్తానికి బౌలింగ్ మరియు బ్యాటింగ్‌తో అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఇది జట్టు విజయం' అని తెలిపాడు.

ఇషాన్ భయం లేకుండా ఆడాడు
'రెండవ ఇన్నింగ్స్‌లో నేను క్రీజులోకి వచ్చేసరికి బంతి కొంచెం బ్యాట్‌పైకి వచ్చింది. నెమ్మదిగా వచ్చిన కొన్ని బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నా. ఇక్కడ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అరంగేట్రంలో నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. తనకు ఇష్టమొచ్చినట్లు బ్యాటింగ్ చేశాడు. భయం లేకుండా కచ్చితమైన షాట్లతో అలరించాడు. ఈ రోజు ఇషాన్ నుంచి ఇలాంటి ఎటాకింగ్ ప్రదర్శన జట్టుకు అవసరం. మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. నేను అతడి ఇన్నింగ్స్ ఎంజాయ్ చేశా. ఐపీఎల్ అనుభవం అతడిని ఇక్కడ ఇలా ఆడేలా చేసిందనుకుంటున్నా' అని కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ఇషాన్ కిషన్ (56; 32 బంతుల్లో 5x4, 4x6) హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

డివిలియర్స్ చెప్పిందే చేశా
'ఆటలో నేను మళ్లీ ప్రాథమిక అంశాలపై దృష్టిసారించాల్సి వచ్చింది. మరోవైపు అనేక ఇతర ఆలోచనలతో సతమతమవుతున్నా. జట్టు కోసం ఆడమంటే ఎప్పుడూ ముందుంటా. నా ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉన్నా. నా బ్యాటింగ్ గురించి జట్టు యాజమాన్యం, నా సతీమణి అనుష్క శర్మ చాలా విషయాలు మాట్లాడారు. నేనేం చేయాలో చెప్పారు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు ఏబీ డివిలియర్స్‌తో స్పెషల్ చాట్ చేశాను. బంతిని మాత్రమే చూసి ఆడమని చెప్పాడు. నేను అదే చేశాను. చివరకు హాఫ్ సెంచరీ బాధాను' అని విరాట్ కోహ్లీ చెప్పాడు.

టీ20ల్లో 3000 పరుగులు
ఈ మ్యాచ్‌లో 73 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ టీ20ల్లో 3000 పరుగుల మైలురాయిని అందుకున్న మొదటి క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. హాఫ్ సెంచరీ బాదడం ద్వారా.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ధ శతకాలు బాదిన క్రికెటర్‌గానూ నిలిచాడు. కోహ్లీకి టీ20 కెరీర్‌లో ఇది 26వ హాఫ్ సెంచరీ కాగా.. రోహిత్ శర్మ 25, మార్టిన్ గప్తిల్ 19 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక కెప్టెన్‌గానూ అంతర్జాతీయ క్రికెట్‌లో 12000 పరుగులు చేసిన తొలి భారతీయుడిగా కోహ్లీ నిలిచాడు.
శుభవార్త చెప్పిన హర్భజన్ సింగ్ సతీమణి.. కమింగ్ సూన్ అంటూ! ఫ్యాన్స్ ఖుషి!


Click it and Unblock the Notifications












