
ముంబై: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ గీతా భస్రా.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఓ శుభవార్త పంచుకున్నారు. జూలైలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు గీతా అఫీషియల్‌గా ప్రకటించారు. భర్త, కూతురుతో ఉన్న పోటోలను ఆమె పంచుకున్నారు. హర్భజన్-గీతాల కూతురు హినయా హీర్ ప్లహా ఓ టీ షర్ట్ పట్టుకుని.. తాను త్వరలో అక్కను కాబోతున్నట్టు చెప్పింది. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విషయం తెలుసుకున్న ఫాన్స్ ఆనందంలో మునిగిపోయారు.
29 అక్టోబర్ 2015న హర్భజన్ సింగ్, గీతా భస్రా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2016లో ఈ దంపతులకు ఓ అమ్మాయి జన్మించింది. ఆమె హినయా హీర్ ప్లహా. ఇప్పుడు జూలైలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు గీతా ప్రకటించారు. గీతా భస్రా బాలీవుడ్‌లో 'దిల్ దియా హై', 'ది ట్రైన్', 'సెకండ్ హ్యాండ్ హాడ్సెండ్' వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. కెరీర్ మంచి ఊపులో ఉండగానే భజ్జీని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు.
కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న హర్భజన్ సింగ్.. త్వరలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2021లో సందడి చేయనున్నాడు. ఐపీఎల్ 2021లో కోల్‌తా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరపున భజ్జీ బరిలోకి దిగనున్నాడు. గత మూడేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్‌లో కొనసాగిన భజ్జీని.. జనవరిలో ఆ జట్టు వదిలేసిన సంగతి తెలిసిందే. చివరిసారి 2019 ఐపీఎల్ ఫైనల్లో ఆడిన హర్భజన్.. అప్పటి నుంచీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరోవైపు కోలీవుడ్‌లో 'ఫ్రెండ్‌షిప్' అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 160 మ్యాచ్‌లాడిన హర్భజన్ సింగ్ మొత్తం 150 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. 2018 నుంచీ చెన్నై తరఫున ఆడుతున్న భజ్జీ 2019 సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఆ జట్టు ఫైనల్ చేరడంలో తనవంతు పాత్ర పోషించాడు. అయితే వ్యక్తిగత కారణాలతో గతేడాది యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో హర్భజన్ ఆడలేదు. ఈ నేపథ్యంలోనే జనవరిలో చెన్నై అతడిని వదిలేసుకుంది. దాంతో కోల్‌కతా ఇప్పుడు కొనుగోలు చేసింది.