న్యూఢిల్లీ: ఓ జాతీయ దినపత్రికపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చిన్నప్పటి నుంచి తాను ఎంతో ఇష్టంగా చదివే సదరు న్యూస్ పేపర్ కూడా తప్పుడు వార్తలను ప్రచురించడం మొదలుపెట్టిందని అసహనం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించి సదరు న్యూస్ పేపర్ క్లిప్‌ను జత చేస్తూ ఇన్‌స్టా స్టోరీలో అభిమానులతో పంచుకున్నాడు.
విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ స్టార్ హీరోయిన అనుష్క శర్మ 2022లో ముంబైకి సమీపంలోని ఖరీదైన అలీబాగ్ ప్రాంతంలో రూ. 19.24 కోట్లు పెట్టి సుమారు 8 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ స్థలంలో విలాసవంతమైన ఫామ్‌హౌస్ నిర్మిస్తున్నారు. అనుష్క-విరాట్ ఇటీవల అలీబాగ్ వెళ్లి ఫామ్‌హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు.

అయితే ఈ ఫామ్‌హౌస్‌లో విరాట్ కోహ్లీ క్రికెట్ పిచ్‌ను నిర్మించాలనుకుంటున్నాడని ఓ జాతీయ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని చదివి షాక్‌కు గురైన కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ఇది తప్పుడు వార్తని స్పష్టం చేశాడు. 'నేను చిన్నప్పటి నుంచి చదివిన వార్తాపత్రిక కూడా నకిలీ వార్తలను ప్రచురించడం ప్రారంభించింది'అని కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొంటూ నకిలీ వార్తకు సంబంధించిన సదరు న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌ను జత చేశాడు.
కోహ్లీ గురించి రోజుకు వందల ఫేక్ న్యూస్ ప్రచారంలోకి వస్తుంటాయి. వీటిని కోహ్లీ కూడా లైట్ తీసుకునేవాడు. ఈ మధ్య ఏమైందో ఏమో కానీ ఫేక్ న్యూస్ కథనాలను ఖండిస్తున్నాడు. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ ఒక వ్యాపార ప్రకటనకు విరాట్ కోహ్లీ రూ.11.45 కోట్లు వసూలు చేస్తున్నాడని ఓ సంస్థ ప్రకటించింది. అయితే ఇందులో నిజం లేదని కోహ్లీ ఖండించాడు.
'సోషల్ మీడియా సంపాదన' వార్తల్లో ఎలాంటి నిజం లేదు'' అని ట్వీటర్ వేదికగా స్పష్టం చేశాడు. ఆసియాకప్ 2023, వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల నేపథ్యంలో ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న విరాట్ కోహ్లీ పూర్తిగా కుటుంబంతో గడుపుతున్నాడు. ఆగస్టు 30 నుంచి మొదలుకానున్న ఆసియా కప్2023 తో విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
కోహ్లీ పోస్ట్‌తో సదరు న్యూస్ పేపర్‌పై అభిమానులు మండిపడుతున్నారు. 'కర్మరా బాబు.. ఈ తప్పుడు కథనాలతో ఏది నిజమో అబద్దమో తెలుసుకోలేకపోతున్నాం'అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.