
చెన్నై: భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సారథ్యంలోని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కమిటీపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన పర్సటైంజ్ ఆఫ్ పాయింట్స్(పీసీటీ) నిబంధనను తప్పుబట్టాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కాలంలో ఎలాంటి మ్యాచ్‌లు జరగకపోవడంతో భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఆధ్వర్యంలో ఐసీసీ కమిటీ పీసీటీ(పర్సటైంజ్ ఆఫ్ పాయింట్స్) నిబంధనను తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం విజయాల శాతం ఆధారంగా జట్ల స్థానాలు మారుతాయి.
ఇంగ్లండ్‌తో మంగళవారం ముగిసిన ఫస్ట్ టెస్ట్‌లో భారత్ 227 పరుగులతో ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. దాంతో టెస్ట్ చాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్లో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. రూల్స్ ఎలా మారుస్తారంటూ అసహనం వ్యక్తం చేశాడు.'పరిస్థితులు అదుపులో ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు.. ఇప్పుడు అంతా బాగానే ఉంది.. అలాంటప్పుడు రూల్స్ కూడా మారాలి.. ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. మ్యాచ్‌లు ఓడిపోవడం.. గెలవడం సహజమే.. అయినా మేం పాయింట్ల గురించి అంతగా బాధపడడం లేదు.. అయితే కొన్ని విషయాల్లో మీరు లాజిక్ లేకుండా రూల్స్ మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడం ఆగ్రహం తెప్పించింది. 'అంటూ పేర్కొన్నాడు.
తొలి టెస్టు ఫలితం అనంతరం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి (68.25 పాయింట్ల శాతం) పడిపోగా, ఇంగ్లండ్ (70.16 పాయింట్ల శాతం) అగ్రస్థానానికి చేరుకుంది. తాజా పరాజయంతో భారత్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఫైనల్ చేరాలంటే భారత్‌కు మరో 70 పాయింట్లు కావాలి. అంటే కనీసం 2 మ్యాచ్‌ల్లో విజయంతో పాటు మరో మ్యాచ్ డ్రా చేసుకున్నా సరిపోతుంది. అయితే తర్వాతి రెండు టెస్టులో ఒక్క మ్యాచ్ ఓడినా టీమిండియా కథ ముగిసినట్లే. కాగా జూన్‌లో లార్డ్స్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు న్యూజిలాండ్ అర్హత సాధించిన విషయం తెలిసిందే.