WTC Final మాకు సవాలే.. ఇరు జట్లకు సమాన అవకాశాలే: విరాట్ కోహ్లీ

ముంబై: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడటం తమకు పెద్ద సవాలేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. అయితే గత కొన్నేళ్లుగా తాము సాధించిన విజయాలను ఆస్వాదించాల్సిన సమయం ఇదని తెలిపాడు. అంతేకాకుండా తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, ఉండబోదని కూడా స్పష్టం చేశాడు. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ కోసం 14 రోజుల హార్డ్ క్వారంటైన్ పూర్తి చేసుకున్న కోహ్లీసేన.. ఈ రాత్రికి ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కనుంది. ఈ నేపథ్యంలో కోచ్ రవిశాస్త్రితో కలిసి మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

గట్టి సవాలే..
'డబ్ల్యూటీసీ ఫైనల్ మాకు సవాల్‌తో కూడుకున్నదే. కానీ ఇది గత కొన్నేళ్లుగా మేం సాధించిన విజయాలను ఆస్వాదించాల్సిన సమయం. ఈ మెగా ఫైనల్ నేపథ్యంతో నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. భవిష్యత్తులో కూడా ఉండదు. ఇది కేవలం ఫైనల్ మాత్రమే. పూర్తిగా ఆస్వాదించాల్సిన సమయం ఇది.'అని విరాట్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌లోని పరిస్థితులు ఇరు జట్లకు సమంగా ఉంటాయన్నాడు. న్యూజిలాండ్‌కు అడ్వాంటేజ్ ఉంటుందన్న వ్యాఖ్యలను కోహ్లీ కొట్టిపారేశాడు. ఎవరు బాగా ఆడితే వారినే విజయం వరిస్తుందని తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఇదే జరిగిందని గుర్తు చేశాడు.

సమానా అవకాశాలు..
'ఇంగ్లండ్‌లోని పరిస్థితులు న్యూజిలాండ్‌తో పాటు మాకు ఒకేలా ఉంటాయి. ఇరు జట్లకు సమాన అవకాశాలుంటాయనే దృక్పథంతోనే అక్కడికి వెళ్తున్నాం. ఎవరు క్రికెట్ బాగా ఆడితే వారినే విజయం వరిస్తుంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఇదే జరిగింది.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక మెగా ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌తో ఆడుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్ వల్ల న్యూజిలాండ్‌కు పెద్ద అడ్వాంటేజ్ ఏం ఉండదని తెలిపాడు. తాము ఇంగ్లండ్ పర్యటనకు తొలిసారి వెళ్లడం లేదని, అక్కడ రాణించాలనే కసి అలానే ఉందన్నాడు. మెగా ఫైనల్‌కు ముందు తమకున్న నాలుగు ప్రాక్టీస్ సెషన్స్ సరిపోతాయన్నాడు.

చిల్ అవ్చొచ్చు..
డబ్ల్యటీసీ ఫైనల్ అనంతరం ఇంగ్లండ్‌తో సిరీస్‌కు చాలా సమయం ఉండటంపై వస్తున్న విమర్శలపై కోహ్లీ స్పందించాడు. ఇలాంటి పెద్ద సిరీస్‌ల ముందు ఖాళీ సమయం ఉండటం జట్టుకు ఉపయోగపడుతుందని, ఆటగాళ్లు చిల్ అవుతారని తెలిపాడు. 'రిలాక్స్ అవ్వడానికి ఇదో గొప్ప అవకాశం. ఐదు టెస్ట్‌ల సిరీస్ ముందు ఆటగాళ్లంతా ఈ సమయాన్ని ఆస్వాదించవచ్చు. అదే విధంగా ఇలాంటి పెద్ద సిరీస్ ముందు మాకు మేం రీగ్రూప్ అవ్వడానికి సమయం ఉంటుంది.'అని కోహ్లీ తెలిపాడు.

మైండ్‌సెట్‌లో మార్పు లేదు..
2014, 2018 ఇంగ్లండ్ పర్యటన తర్వాత మరోసారి అక్కడి వెళ్తున్న కోహ్లీని.. మైండ్‌సెట్‌లో ఏమైనా మార్పులు వచ్చాయని ప్రశ్నించగా.. అలాంటిదేం లేదని బదులిచ్చాడు. '2014లో మీరు 'నేను 2021లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాతారని మీరు చెబితే నమ్మడానికి నేను కొంచెం కష్టంగా భావించేవాడిని. నేను సిరీస్‌లను అంతిమ లక్ష్యాలుగా చూడటం మానేశాను. జట్టును సరైన మార్గంలో నడిపించడమే లక్ష్యంగా భావిస్తున్నాను. ఇక నా మైండ్ సెట్ మారిందని నేను అనుకోను. ఎక్కడకు వెళ్లినా బాగా ఆడానా? లేదా? అని చూసుకుంటా? జట్టులో నా ప్రదర్శన ఎలా ఉందని సమీక్షించుకుంటా'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ ప్రశ్నకు.. 2014లో కోహ్లీ బొద్దుగా ఉంటే.. ఇప్పుడే ఫిట్‌గా ఉన్నాడని, అంతేకాకుండా మరో 5 వేల 500 పరుగులు చేశాడని రవిశాస్త్రి చమత్కరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications