
దుబాయ్: షాట్ ఆడాలా? వద్దా? అనే సందిగ్దతనే తమ కొంపముంచిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమయ్యామని చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ కనీస పోరాటం చేయలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన విరాట్ కోహ్లీ ఓటమికి గల కారణాన్ని వెల్లడించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే గెలవాలనే తపన తమలో కనిపించలేదన్నాడు. తరుచుగా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నామని, దాంతో బౌలర్లు ఏం చేయలేని పరిస్థితి వచ్చిందన్నాడు.
' చాలా ఆశ్చర్యంగా ఉంది. మేం బ్యాట్‌తో కానీ.. బంతితో కానీ తెగించి ఆడలేకపోయాం. మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు మా బాడీ లాంగ్వేజ్ కూడా సరిగ్గాలేదు. న్యూజిలాండ్ మాత్రం సరైన ఇంటెంట్ కనబర్చింది. అవకాశం దొరికిన ప్రతీసారి దెబ్బకొట్టింది. దాంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. వికెట్ పడిన ప్రతిసారీ మేం రిస్క్ తీసుకున్నాం. షాట్లు ఆడాలా వద్దా అనే సందిగ్ధంలో పడిన నేపథ్యంలోనే ఇలా జరిగింది. అలాగే మేం రక్షించుకునేంత స్కోరు చేయలేకపోయినా.. కనీసం పోరాడలేకపోయాం.
భారత్ తరఫున ఆడుతున్నప్పుడు ఎన్నో అంచనాలు ఉంటాయి. మా విజయాన్ని కోరుకుంటూ ప్రజలు స్టేడియాలకు వస్తారు, టీవీల్లో మమ్మల్ని గమనిస్తుంటారు. అయితే ఈ ఒత్తిడి సహజమే. ఇదేం కొత్త కాదు. భారత్ తరఫున ఆడుతున్నప్పుడు ఇవి మాములే. వీటన్నిటి స్వీకరించి ఆడాలి. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో మేం ఆ పనిచేయలేకపోయాం. అందుకే విజయాలను అందుకోలేకపోయాం. అయితే మేం సానుకూల దృక్పథంలో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఒత్తిడి పక్కనపెట్టి గుడ్ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించాలి. టోర్నీలో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వాటిలోనైనా మెరుగ్గా రాణించాలని కోరుకుంటున్నా'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఈ ఓటమితో టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పోరాటం దాదాపు ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 110 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26 నాటౌట్), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో ఫోర్‌తో 23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఇష్ సోదీ రెండు వికెట్లు తీశారు. టీమ్ సౌథీ, ఆడమ్ మిల్నే తలో వికెట్ పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో 2 వికెట్లకు 111 పరుగులు చేసి 33 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. డారిల్ మిచెల్(35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), కేన్ విలియమ్సన్(31 బంతుల్లో 3 ఫోర్లతో 33 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి.