బెంగళూరు: చెత్త ప్రదర్శనతో తామే ప్రత్యర్థికి విజయాన్నందించామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తాత్కలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఆర్‌సీబీ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
ఇంత చెత్తగా ఆడినప్పుడు ఓటములే ఎదురవుతాయన్నాడు. 'ఈ మ్యాచ్‌లో మేమే చెత్త ఆటతో ప్రత్యర్థిని గెలిపించాం. ఈ ఓటమికి మేం పూర్తిగా అర్హులం. ఈ రోజు మేం ఏమాత్రం ప్రొఫెషనల్‌గా ఆడలేదు. అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ చెత్త ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకున్నాం. సునాయస క్యాచ్‌లు నేలపాలు చేసి కేకేఆర్ గెలిచేలా చేశాం.

మేం వదిలేసిన రెండు క్యాచ్‌లు మా ఓటమిని శాసించాయి. ఆ రెండు క్యాచ్‌లు వదిలేయడం వల్ల కేకేఆర్ 25-30 పరుగుల అదనంగా చేసింది. బ్యాటింగ్‌లో మేం పోరాడినా.. నాలుగు-ఐదు సాఫ్ట్ డిసిమిసల్స్ ఓటమిని శాసించాయి. చెత్త బంతులను కూడా నేరుగా ఫీల్డర్ల చేతిలోకి కొట్టి వెనుదిరిగాం. చేజింగ్‌లో వికెట్లు కోల్పోయినా.. ఓ భాగస్వామ్యంతో మ్యాచ్‌పై పట్టు బిగించవచ్చు. కానీ ఈ రోజు మేం అది చేయలేకపోయాం. ఈ తప్పిదాల నుంచి మేం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. చివర్లో రింకూ సింగ్(18 నాటౌట్), డేవిడ్ వైస్(12 నాటౌట్) మెరుపులు మెరిపించారు. జాసన్ రాయ్(29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56), నితీశ్ రాణా(21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48) రాణించగా..రింకూ సింగ్(18 నాటౌట్), డేవిడ్ వైస్(12 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆర్‌సీబీ బౌలర్లలో హసరంగా, విజయ్ కుమార్ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. విరాట్ కోహ్లీ (37 బంతుల్లో 6 ఫోర్లతో 54), మహిపాల్ లోమ్రోర్(18 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 34) రాణించినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో సుయాశ్ శర్మ, ఆండ్రీ రస్సెల్ రెండేసి వికెట్లు తీయగా.. వరుణ చక్రవర్తీ మూడు వికెట్లు పడగొట్టాడు.