
చెన్నై: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న దీక్షపై జట్టులో సుమగ్రంగా చర్చించామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. జట్టులోని ప్రతీ ఆటగాడు రైతు ఉద్యమంపై తమ అభిప్రాయాలను తెలిపారని చెప్పాడు. ఇంగ్లండ్‌తో చెన్నై వేదికగా శుక్రవారం నుంచి ఫస్ట్ టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ఈ సందర్భంగా రైతు ఉద్యమంపై స్పందించమని మీడియా ప్రతినిధులు విరాట్ కోహ్లీని కోరగా.. 'జట్టు సమావేశంలో రైతు ఉద్యమంపై సమగ్రంగా చర్చించాం. ప్రతీ ఒక్కరు వారి అభిప్రాయాలను తెలిపారు.'అని చెప్పాడు. చర్చకు సంబంధించిన ఎలాంటి విషయాలను కోహ్లీ వెల్లడించలేదు.
రైతుల ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం అమెరికా పాప్ సింగర్ రిహానా, మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా, పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు.
దీనికి కొనసాగింపుగా భారత సినీ ప్రముఖులు, క్రికెటర్లు, సెలెబ్రిటీలు కూడా #IndiaTogether #IndiaAgainstPropaganda వంటి హ్యాష్ ట్యాగ్‌లతో కేంద్ర ప్రభుత్వానికి మద్దుతుగా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ట్విటర్ వేదికగా స్పందించాడు. "భిన్నాభిప్రాయలు ఉన్నప్పటికీ అందరం కలిసికట్టుగా ఉందాం. రైతులు మన దేశంలో అంతర్భాగం. అందరం శాంతియుతంగా సమష్టిగా ముందుకు వెళ్లేలా అన్ని వర్గాల మధ్య సామరస్యపూర్వక పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాను" అని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, రోహిత్ శర్మ, రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే, శిఖర్ ధావన్‌లు కూడా భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఇంటర్నేషనల్ సెలెబ్రిటీలకు సూచిస్తూ ట్వీట్లు చేశారు.