
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, తన సతీమణి అనుష్క శర్మను తొలిసారి చూసినప్పుడు చాలా భయపడ్డానని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు చెందిన 360 యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ.. అనుష్కతో తన ప్రేమాయణం ఎలా నడిచిందో వివరించాడు. ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్‌లో తొలిసారి అనుష్క శర్మను చూసానని చెప్పిన కోహ్లీ.. భయంతో ఏ మాట్లాడాలో అర్థం కాలేదని తెలిపాడు.
'అనుష్క శర్మను 2013లో తొలిసారి చూశాననుకుంట. జింబాబ్వే పర్యటనకు నన్నే కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఆ విషయం తెలిసి నేను ఎంతో ఉద్వేగానికి గురయ్యాను. అంతలోనే నా మేనేజర్ వచ్చి ఓ కమర్షియల్ యాడ్ చేయాలని చెప్పాడు. అది కూడా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో నటించాలని చెప్పాడు.

వెంటనే నాకు ఏదో తెలియని భయం కలిగింది. అమె అప్పటికే స్టార్ హీరోయిన్ కావడంతో.. నా వెన్నులో కాస్త వణుకుపుట్టింది. అసలు ఆమెతో ఎలా యాక్ట్ చేయాలి, ఎలా మాట్లాడాలో అనే విషయమే అర్థం కాలేదు. ఐదు నిమిషాలు ఆలస్యంగా లోకేషన్‌కు వెళ్లాను. ఆమె చాలా ఎత్తుగా కనిపించింది. కిందికి చూస్తే హై హీల్స్ వేసుకొని కనిపించింది.
నేను వెంటనే దీనికంటే ఎత్తయిన చెప్పులు దొరకలేదా? అని ప్రశ్నించా. ఆమె అదోలా నావైపు చూసింది. ఆ తర్వాత యాడ్ షూటింగ్ ప్రారంభమైంది. రోజంతా జరిగిన ఈ షూట్‌లో ఆమెతో పరిచయం కూడా పెరిగింది. అప్పుడే ఆమె కూడా సాధారణ అమ్మాయే అని అర్థమైంది. ఇద్దరి కుటుంబ నేపథ్యాలు సామాన్య మధ్యతరగతివే కావడంతో తొందరగా కనెక్ట్ అయ్యాం.

అనుష్క శర్మకు ప్రపోజ్ చేయకుండా ముందు రెండు సందర్భాల్లో ఆమెకు ఇబ్బందికరమైన మెసేజ్‌లు పెట్టాను. మాకు పరిచయమైనా.. చాలా రోజుల తర్వాత డేటింగ్ చేశాం. అయినా, తొలి రోజు నుంచే ఆమెతో డేటింగ్‌లో ఉన్న ఫీలింగ్ నాకు కలిగింది. పరిచయం అయిన కొద్దిరోజులకే అనుష్కే నా సొంతం అనుకున్నాను. ఓ రోజు డేటింగ్‌లో ఉన్నట్లే అనిపిస్తోందని మెసేజ్ పెట్టాను. దాంతో ఆమె ఒక్కసారిగా సీరియస్ అయ్యింది. దాంతో నేను మాటల్లో పెట్టి ఆమె కోపాన్ని తగ్గించాను.
ఒక రోజు నా గురించి ఏమనుకుంటున్నావని ప్రశ్నించింది. దాంతో మనిద్దరం డేటింగ్‌లో ఉన్నట్లుందని చెప్పా. అప్పుడు కూడా ఆమె కొద్దిగా ఇబ్బంది పడినట్లనిపించింది. క్రమంగా నా మనసును అర్థం చేసుకొని ఓ మంచి వ్యక్తిగా గుర్తించింది'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన తర్వాత వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట.. వామికాకు జన్మనిచ్చింది.