
ప్రమోషన్స్‌లో భాగంగా..
ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఆర్‌సీబీ ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. పాత జట్టులోని కొందరు సభ్యులతో ఓ పాడ్కాస్ట్ షోను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విరాట్ కోహ్లీతో పాటు ఏబీ డివిలియర్స్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్, దేవదత్ పడిక్కల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తదితర ఆటగాళ్లు పాల్గొని జట్టుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. లీగ్ తొలి సీజన్‌లో(2008) జట్టుకు ఎంపికైన నాటి భావోద్వేగ క్షణాలను నెమరువేసుకున్నాడు.

ఢిల్లీ కూడా పోటీ పడింది..
'ఐపీఎల్ తొలి వేలం జరిగే సమయానికి నేను అండర్-19 ప్రపంచకప్ కోసం మలేషియాలో ఉన్నాను. నా కోసం బెంగళూరుతో పాటు ఢిల్లీ ఫ్రాంచైజీ పోటీ పడిన విషయాన్ని ఇప్పటికీ మరచిపోను. నాడు వేలంలో బెంగళూరు జట్టు తనను దాదాపుగా రూ. 25 లక్షలకు(30000 డాలర్లు) సొంతం చేసుకుంది. ఆర్‌సీబీ తన కోసం అంత భారీ మొత్తం వెచ్చిస్తుందని అస్సలు ఊహించలేదు. ఆ సమయంలో అంత డబ్బును ఊహించుకుని చాలా క్రేజీగా ఫీలయ్యాను. అగ్రిమెంట్ పేపర్లపై సంతకం చేసిన రోజు నాకింకా గుర్తుంది. టీమిండియాకు ఆడితే కలిగే ఆర్ధిక ప్రయోజనాల గురించి నాకు అప్పుడే తెలిసింది. అప్పుడు నా కోసం ఢిల్లీ ఫ్రాంచైజీ సైతం పోటీపడినప్పటికీ.. వారికి బౌలర్ల అవసరం ఉండడంతో ప్రదీప్ సాంగ్వాన్ వైపు మొగ్గు చూపారు.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఒక్క టైటిల్ కూడా..
విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ ఫస్ట్ సీజన్ నుంచి ఆర్‌సీబీ మినహా మరే ఇతర జట్టుకు ప్రాతనిధ్యం వహించలేదు. 2008 నుంచి 2012 దాకా ఆర్‌సీబీలో సాధారణ ఆటగాడిలా కొనసాగిన కోహ్లీ.. 2013 నుంచి 2021 సీజన్ వరకు సారధిగా వ్యవహరించాడు. జట్టును మూడు సార్లు(2015, 2020, 2021) ప్లే ఆఫ్స్ చేర్చిన కోహ్లీ.. 2016లో ఫైనల్‌కు తీసుకెళ్లాడు. కానీ ఫైనల్లో సన్‌రైజర్స్ చేతిలో ఓడిన ఆ జట్టు తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఇక గత సీజన్‌తోనే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లీ.. ఈ సీజన్ నుంచి కేవలం ఆటగాడిగానే కొనసాగనున్నాడు. ఈ సీజన్ కోసం ఆర్‌సీబీ.. కోహ్లీని రూ.15 కోట్లు, గ్లేన్ మ్యాక్స్‌వెల్ రూ.11 కోట్లు, మహమ్మద్ సిరాజ్‌ను రూ.7 కోట్లకు రిటైన్ చేసుకుంది.

లీగ్ టాప్ బ్యాట్స్‌మన్‌గా..
ఐపీఎల్ లీగ్‌లో కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన టాప్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 6283 రన్స్ చేసిన కోహ్లీ.. ఐదు సెంచరీలు బాదాడు. సెంచరీ జాబితాలో రెండో బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఇక సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసింది కూడా కోహ్లీనే. 2016 సీజన్‌లో 973 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే టాప్. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీ..బ్యాట్స్‌మన్‌గా సత్తా చాటుతాడని అతని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications
