టీ20 క్రికెట్ అంటే దంచికొట్టుడే కాదని, పరిస్థితులకు తగ్గట్లు ఆడటం కూడా కీలకమేనని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. భాగస్వామ్యాలు ముఖ్యమనే విషయాన్ని బ్యాటర్లు మర్చిపోతున్నారని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో విరాట్ కోహ్లీ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. వరుస మ్యాచ్‌ల్లో రాణిస్తూ.. ఆర్‌సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ.. కృనాల్ పాండ్యాతో కలిసి 119 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ఫార్మాట్ ఏదైనా పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ఎంత కీలకమో వివరించాడు.
ఇదో గొప్ప విజయం..
'పిచ్ పరంగా ఇది మాకు గొప్ప విజయం. గతంతో పోలిస్తే ఈ వికెట్ చాలా భిన్నంగా ఉంది. ఛేజింగ్‌లో నేనెప్పుడూ డగౌట్‌వైపు చూస్తూ ఉంటాను. మేం సరైన మార్గంలోనే ఉన్నామా? నా బాధ్యతను నేను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నానా? లేదా? అని పరిశీలించుకుంటా. ఈ రోజు కృనాల్‌ది. అతని నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ కోసం మేం వేచి చూస్తున్నాం. ఏ బౌలర్లను టార్గెట్ చేయాలనేది చర్చించుకొని ఆడాం. ఇన్నింగ్స్‌ను నిలకడగా ముందుకు తీసుకెళ్లేందుకు సింగిల్స్, డబుల్స్‌ను తీయడంతో పాటు వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాను. కృనాల్, నేను మంచి అవగాహనతో బ్యాటింగ్ చేశాం. నన్ను నెమ్మదిగా ఆడామని, తాను ఛాన్స్ తీసుకుంటానని కృనాల్ చెప్పాడు.

గుడ్డిగా ఆడుతానంటే కుదురదు..
ఈ ఏడాది గుడ్డిగా బ్యాట్ ఊపుతానంటే కుదురదు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాల్సిందే. ఈ మధ్య ఆటగాళ్లు భాగస్వామ్యాల ప్రాముఖ్యతను మర్చిపోతున్నారు. బలమైన పార్ట్‌నర్‌షిప్ ఉన్నప్పుడే.. బౌలర్లపై ఆధిపత్యం చలాయించగలమనే విషయాన్ని గుర్తించాలి. మా బ్యాటింగ్ విభాగంలో మంచి కమ్యూనికేషన్ ఉండటంతోనే 10 మ్యాచ్‌ల్లో 7 గెలిచాం. మెరుగైన స్థితిలో నిలిచాం. మాకు బ్యాకప్‌గా రొమారియో, టీమ్ డేవిడ్‌లతో కూడిన బ్యాటింగ్ పవర్ ఉంది. వారి ఫైర్ పవర్ జట్టుకు ఉపయోగపడుతోంది. హజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ వరల్డ్ క్లాస్ బౌలర్లు. అందుకే హజెల్ వుడ్‌కు పర్పుల్ క్యాప్ దక్కింది. కృనాల్ సైతం అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సుయాశ్ శర్మను కూడా మెచ్చుకోవాల్సిందే. అతను వికెట్లు తీయకున్నా.. తన బౌలింగ్‌తో తీవ్ర ప్రభావం చూపుతున్నాడు.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
కోహ్లీ, కృనాల్ హాఫ్ సెంచరీలు..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(41), ట్రిస్టన్ స్టబ్స్(34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/33) మూడు వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్, కృనాల్ పాండ్యాకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం ఆర్‌సీబీ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 165 పరుగులు చేసి గెలుపొందింది. కృనాల్ పాండ్యా(73 నాటౌట్), విరాట్ కోహ్లీ(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా.. చమీర ఒక వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది.