మనకు పుట్టిన పిల్లలతో గడపడం కన్నా మించిన సంతోషం ఏది లేదని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. వారితో సమయం గడపడాన్ని ప్రపంచంలోనే అత్యంత విలువైన పనిగా అభివర్ణించాడు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం తన కుటుంబంతో కలిసి శుక్రవారం అమెరికా వెళ్లిన విరాట్ కోహ్లీ.. అమెరికాకు చెందిన ఓ పెయిన్ రిలీఫ్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా ఎంపికయ్యాడు.
ఈ సందర్భంగా సదరు కంపెనీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. విరాట్ కోహ్లీ ఈ ఏడాదే రెండోసారి తండ్రైన విషయం తెలిసిందే. అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఫిబ్రవరిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అతనికి ఈ స్టార్ దంపతులు 'అకాయ్'అని పేరు పెట్టుకున్నారు.

అకాయ్ రాకతో..
అంతకుముందు 2021లో ఈ స్టార్ జోడీకి వామికా అనే కూతురు పుట్టింది. తన ఇద్దరి పిల్లలతో సంతోషంగా ఉన్న విరాట్ కోహ్లీ.. ఖాళీ సమయం దొరికితే వారితో గడిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ అనంతరం పూర్తిగా ఇంటికే పరిమితమైన కోహ్లీ.. తన పిల్లలతో ఈ విశ్రాంతి సమయాన్ని గడిపాడు.
టీ20 ప్రపంచకప్ 2024 కోసం టీమిండియా ముందుగానే వెళ్లగా..కోహ్లీ మాత్రం ఆలస్యంగా జట్టుతో కలుస్తానని బీసీసీఐ పర్మీషన్ తీసుకున్నాడు. శుక్రవారం ముంబై నుంచి తన ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా బయల్దేరాడు. తమ పిల్లల ఫొటోలు బయటకు రాకుండా కోహ్లీ, అనుష్క శర్మలు జాగ్రత్త పడుతున్న విషయం తెలిసిందే.
విలువైన బహుమతులతో..
ఇప్పటికీ అన్నీ మీడియా సంస్థలకు ఈ ఇద్దరూ ప్రత్యేకమైన లెటర్స్ రాసారు. తమ పిల్లల ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరారు. ఇక విమానాశ్రాయాల్లో సెలెబ్రిటీల ఫొటోలు తీసే పప్పరాజీలకు అనుష్క-కోహ్లీ జోడీ తమ పిల్లల ఫొటోలు తీయవద్దని కోరారు. వారికి విలువైన బహుమతులను కూడా అందజేసారు.
తాజాగా TIDL అనే పెయిన్ రిలీఫ్ కంపెనీకి విరాట్ కోహ్లీ ప్రచారకర్తగా ఎంపికయ్యాడు. అమెరికా సంస్థ అయిన TIDL తమ ఉత్పత్పులను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. తాజాగా ఈ కంపెనీ తమ ప్రొడక్స్‌ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి విరాట్ కోహ్లీ.. బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగానే తమ పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'మనకు పుట్టిన పిల్లలతో ఉండటం, వారితో సమయం గడపడం ప్రపంచంలోనే అత్యంత విలువైన పని. వారితో గడపడం చాలా సంతోషాన్నిస్తోంది. మైదానంలో అంత శక్తివంతంగా ఎలా? ఉంటావని చాలా మంది నన్ను తరుచూ అడుగుతుంటారు. నేను 120 శాతం పోటీ ఇచ్చేందుకు మైదానంలోకి అడుగుపెడుతా. ఏ నాడు 75 శాతం ఎఫర్ట్‌తో మైదానంలోకి రాలేదని బదులిస్తా.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.