
కోహ్లీ తొలిసారే..
2011 వన్డే ప్రపంచకప్ ముందు ఐదు మెగా టోర్నీలు ఆడిన సచిన్ చివరకు తన కలను సాకారం చేసుకున్నాడు. సచిన్‌తో పాటు సెహ్వాగ్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, జహీన్ ఖాన్ మూడో సారి ప్రపంచకప్ కలను నెరవేర్చుకోగా.. కోహ్లీ, గౌతమ్ గంభీర్, శ్రీశాంత్, సురేశ్ రైనా, యుసఫ్ పఠాన్, రవిచంద్రన్ అశ్విన్ తొలిసారే అందుకున్నారు. ప్రపంచకప్ గెలిచిన జట్టులో విరాట్ కోహ్లీ ఒక్కడే చిన్నవాడు. తాజాగా ఈ విజయాన్ని గుర్తు చేసుకున్న విరాట్ కోహ్లీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

లక్కీగా జట్టులోకి..
ఆర్‌సీబీ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. అసలు ఆ మెగా టోర్నీకి తాను ఎంపికవుతానని కూడా అనుకోలేదన్నాడు. 'నేను ఆ జట్టులో లక్కీగా చోటు దక్కించుకున్నాను. నా ఎంపికకు దారితీసిన పరిస్థితులు కూడా అద్భుతంగా అనిపించాయి. నేను పరుగుల వరద పారించడంతో నాకు అవకాశం దక్కింది. ప్రపంచకప్ ఆడుతానని నేను అస్సలు ఊహించలేదు. సచిన్ టెండూల్కర్ ఆరోసారి ప్రపంచకప్ గెలిస్తే.. నేను తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలిచాను. విశ్వవిజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాను.'అని చెప్పుకొచ్చాడు.

ఐసీసీ టైటిల్ గెలవకపోయినా..
ఇక రెండేళ్ల తర్వాత భారత్ గెలిచిన 2013 చాంపియన్స్ ట్రోఫీలో కూడా విరాట్ కోహ్లీ భాగమయ్యాడు. ప్లేయర్‌గా రెండు ఐసీసీ టైటిళ్లు సాధించిన కోహ్లీ.. కెప్టెన్‌గా మాత్రం ఒక్క టైటిల్ సాధించలేకపోయాడు. ఐసీసీ టోర్నీలు గెలవకపోవడంతో తనను ఫెయిల్యూర్ కెప్టెన్ అన్నారని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయినా.. భారత జట్టులో కొత్త సంస్కృతిని తీసుకొచ్చానని చెప్పాడు. 'టోర్నీలు గెలవడానికి ఆడుతారు. కానీ అదొక్కటే ముఖ్యం కాదు. 2017 చాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టును ఫైనల్‌కు చేర్చాను.

ఒక్కటి కూడా గెలవని వారున్నారు..
2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరాం. 2021 టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓడాం. ఐదు టెస్ట్ మ్యాచ్‌లు వరుసగా గెలిచాం. అయినా నన్ను ఫెయిల్యూర్ కెప్టెన్ అన్నారు. ఐసీసీ టెటిల్ గెలవకపోయినా.. నా సారథ్యంలో జట్టులో ఎన్నో మార్పులు వచ్చాయి. వాటికి నేను ఎప్పుడూ గర్వపడతాను. టోర్నమెంట్ ఒక నిర్దిష్ట కాలానికి జరుగుతుంది కానీ ఒక సంస్కృతి చాలా కాలం ఉంటుంది. నేను ప్లేయర్‌గా వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీని గెలిచాను. ఇప్పటికీ ప్రపంచకప్ గెలవని ఆటగాళ్లు కూడా ఉన్నారు.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












