న్యూఢిల్లీ: తన కెరీర్‌లో సాధించిన తొలి టెస్ట్ డబుల్ సెంచరీని ఎప్పటికీ మరిచిపోనని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. అది తనకు ఎంతో స్పెషలని చెప్పుకొచ్చాడు. తనకు ఎంతో ఇష్టమైన లెజెండరీ క్రికెటర్ సర్ వీవ్ రిచర్డ్స్ ముందు ఆ డబుల్ సెంచరీ సాధించానని గుర్తు చేసుకున్నాడు.
2016 వెస్టిండీస్ పర్యటనలో విరాట్ కోహ్లీ తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఆంటీగా వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌కు సర్ వీవీ రిచర్డ్స్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ.. బుధవారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్ కోసం సన్నదమవుతున్నాడు. ఈ మ్యాచ్ నేపథ్యంలో వెస్టిండీస్ పర్యటనలోని తన అనుభవాలను కోహ్లీ పంచుకున్నాడు.

'వెస్టిండీస్‌లో నా ఫెవరెట్ మూమెంట్ అంటే అంటీగాలోనే. సర్ వీవ్ రిచర్డ్స్ ముందు టెస్టుల్లో నా మొట్ట మొదటి డబుల్ సెంచరీ సాధించాను. అది నా కెరీర్‌లోనే చాలా స్పెషల్ మూమెంట్. ఆ రోజు సాయంత్రం ఆయన నన్ను కలిసి అభినందనలు తెలిపారు. చాలాసేపు నాతో మాట్లాడారు. అంతకంటే గొప్ప విషయం ఇంకేమీ ఉంటుంది. ఆయన నా చిన్ననాటి హీరో. రిచర్డ్స్ మాట్లాడిన ప్రతీ మాట, నాకు ఇప్పటికీ గుర్తుంది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
2016 వెస్టిండీస్ పర్యటనలో తొలి డబుల్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. అదే ఏడాది మరో మూడు డబుల్ సెంచరీలు నమోదు చేశాడు. ఆ తర్వాతి ఏడాది 2017లో మరో 3 డబుల్ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ.. 2019లో ఏడో డబుల్ సెంచరీ బాది.. టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు
2016 వెస్టిండీస్ పర్యటనలో కోహ్లీ తొలి డబుల్ సెంచరీ బాదగా.. రవిచంద్రన్ అశ్విన్( 113) తొలి సెంచరీ అందుకున్నాడు. శిఖర్ ధావన్ (84), అమిత్ మిశ్రా (53), వృద్దిమాన్ సాహా (40)లు రాణించారు. దాంతో టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 566 పరుగుల భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 243, రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులు చేసి ఇన్నింగ్స్, 92 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.