పోర్ట్ ఆఫ్ స్పెయిన్: కెరీర్‌లో తాను సాధించిన రికార్డులు, సెంచరీలు ఎందుకూ పనికి రావని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. రికార్డులు, సెంచరీల కన్నా జట్టు విజయంలో ఎంత ప్రభావం చూపామనేది ముఖ్యమని తెలిపాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో కోహ్లీ(206 బంతుల్లో 11 ఫోర్లతో 121) శతక్కొట్టిన విషయం తెలిసిందే.
2018లో చివరిసారిగా ఆస్ట్రేలియాలో శతకం బాదిన కోహ్లీ.. ఐదేళ్ల తర్వాత ఓవర్‌సీ సెంచరీ అందుకున్నాడు. విదేశాల్లో కోహ్లీకి ఇది 15వ సెంచరీ. ఈ రికార్డుపై మాట్లాడుతూ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నిజం చెప్పాలంటే ఈ రికార్డులు, సెంచరీలు ఎందుకు పనికి రావు. ఇవన్నీ బయటివారు మాట్లాడుకోవడానికి మాత్రమే. విదేశాల్లో నేను 15 సెంచరీలు చేశాను.

స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ సెంచరీలు చేశాను. అది చెత్త రికార్డు ఏమీ కాదు. విదేశాల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడి ఉంటే మరిన్నీ సెంచరీలు చేసేవాడినేమో. ఈ ఐదేళ్లలో విదేశాల్లో మేం 30 మ్యాచ్‌లు ఆడలేదు. సరిగ్గా ఎన్ని మ్యాచ్‌లు అనేది నాకు తెలియదు. కానీ బిగ్ నంబర్ అయితే కాదు. విదేశాల్లో ఆడిన మ్యాచ్‌ల్లో కొన్ని హాఫ్ సెంచరీలు కూడా చేశాను.
నేను హాఫ్ సెంచరీ చేసినప్పుడు సెంచరీ చేయలేదని, 120 చేస్తే డబుల్ సెంచరీ అందుకోలేదని అనిపిస్తోంది. ఈ 15 ఏళ్ల కెరీర్‌లో నేను సాధించిన రికార్డులు, ఘనతలు ఎందుకూ పనికి రావు. జనాలకు గుర్తుండేది ఒక్కటే.. టీమ్ విజయంలో ఎంత ప్రభావం చూపించామనేది.
భారత్ తరఫున 500 మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కడం గర్వకారణం. నేను ఇన్ని మ్యాచ్‌లు ఆడుతానని ఊహించలేదు. అయితే ఈ ఘనతను అందుకునేందుకు చాలా కష్టపడ్డాను. ఎంతో కమిట్‌మెంట్‌తో ఆడాను. 10 బంతుల్లో ఎక్కువ బౌండరీలు బాది స్ట్రైక్‌రేట్ మెరుగుపరుచుకునే ఆటగాడిని కాదు.
అవసరమైతే సింగిల్స్, డబుల్స్‌తోనూ పరుగులు రాబట్టాలనుకుంటా. కరేబియన్ మైదానాల్లో ఈ గ్రౌండ్ నాకు చాలా ఇష్టం. ఈ మైదానాన్ని నా హోం గ్రౌండ్‌లా ఫీలవుతాను. పరిస్థితులు బ్యాటింగ్ అనుకూలంగా లేకున్నా.. టైమ్ తీసుకొని సెంచరీ సాధించడం సంతోషంగా ఉంది.
నేను క్రీజులోకి వచ్చినప్పుడు విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. బంతి పాతబడేవరకు నేను ఓపికగా ఆడాను. పిచ్‌తో పాటు ఔట్ ఫీల్డ్ కూడా స్లోగా ఉండటంతో వేగంగా పరుగులు రాలేదు. ఇన్ని ప్రతీకూల పరిస్థితుల మధ్య సెంచరీ చేయడం సంతృప్తినిచ్చింది.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.