రోహిత్.. నీ సహకారంతోనే ఈ సెంచరీ.. సిక్స్‌లు కొట్టడం నా ఆట కాదు: విరాట్ కోహ్లీ

దుబాయ్: దాదాపు మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. కెప్టెన్ రోహిత్ శర్మ సహకారంతోనే ఇది సాధ్యమైందని చెప్పాడు. ఆసియాకప్ 2022లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన తమ చివరి సూపర్ 4 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 122 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విరాట్ చిట్ చాట్ చేశాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో విరాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా రోహిత్, రాహుల్ ద్రవిడ్ తనకు అందించిన సహకారం గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.

సిక్స్‌లు కొట్టడం నా ఆట కాదు..
'సూపర్-4లో పాకిస్థాన్, శ్రీలంకతో మ్యాచ్‌ల్లో ఎక్కడ తప్పులు చేశామో తెలుసుకుని, పాఠాలు నేర్చుకుంటాం. టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి నాకెప్పుడూ స్పష్టమైన సమాచారం ఉంది. నువ్వు (రోహిత్) ఇచ్చిన విరామం కారణంగా ఉపశమనం పొందా. మంచి క్రికెట్ షాట్లపైనే ఆధారపడ్డా. సిక్సర్లు కొట్టడం నా బలం కాదు. పరిస్థితులు డిమాండ్ చేస్తే బంతిని స్టాండ్స్‌లోకి పంపిస్తా. కానీ ఖాళీలు చూసి ఫోర్లు రాబట్టడంలోనే నేను మెరుగు. అలా బౌండరీలు కొడుతున్నంత సేపు జట్టు ప్రయోజనాల కోసం పాటుపడుతున్నట్టే. కోచ్‌లకు కూడా భారీ షాట్లు ఆడడం కంటే కూడా ఖాళీలు చూసి బ్యాటింగ్ చేస్తానని చెప్పా.

సెట్ అయ్యాక కూడా..
టీ20ల్లో స్ట్రైక్‌రేట్ పెంచాలంటే కేవలం సిక్సర్లు మాత్రమే కొట్టాలనేది ఎల్లప్పుడూ సరికాదు. అలా చేయకుండానే తిరిగి నా ఫామ్ పొందా. 10-15 బంతులు ఆడి కుదురుకున్న తర్వాత నేను మరింత వేగంగా ఆడగలను. కానీ గతంలో ఇందుకు భిన్నంగా వ్యవహరించాను. నేనేంటో నీకు (రోహిత్) బాగా తెలుసు. మనం చాలా కాలంగా కలిసి ఆడుతున్నాం. సరైన మానసిక దృక్పథంతో క్రీజులో ఉంటేనే మనం రాణించగలం. మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మధ్య ఓవర్లలో స్ట్రైక్‌రేట్ ఎలా మెరుగుపరుచుకోవాలన్న దానిపై కోచ్ రాహుల్ నాతో మాట్లాడాడు. జట్టుకు సాయపడే విధంగా పరిస్థితులను ఎలా మెరుగుపరచాలన్నదే నా లక్ష్యం. ఆసియా కప్‌లో అదే దృక్పథంతో ఆడాను.

60 పరుగులు చేసినా..
నా ఆటతీరు గురించి చాలా మంది ఎన్నో సలహాలిచ్చారు. ఆ తప్పు, ఈ తప్పు చేస్తున్నానని నాకు చెప్పారు. గతంలో నేను మంచి ప్రదర్శన చేసిన రోజుల నాటి వీడియోలను మళ్లీ చూశా. బంతిని ఆడే విషయంలో నా కదలికలు, విధానం అలాగే ఉంది. కానీ నా మెదడులో ఏం జరిగిందో వివరించలేను. ఓ వ్యక్తిగా మనపై ప్రజలకు విభిన్నమైన అభిప్రాయాలుంటాయి. కానీ మనం ఏం అనుకుంటున్నామనదే వాళ్లు పట్టించుకోరు. గత కొన్ని మ్యాచ్‌ల సాయంతోనే అఫ్గాన్‌పై ఇన్నింగ్స్ నిర్మించా. గతంలో నేను 60 పరుగులు చేసినా విఫలమైనట్లే చూడడం నాకు షాక్‌గా అనిపించింది.' అని కోహ్లి పేర్కొన్నాడు.

హిట్టింగే ప్రధానం కాదని..
అలాగే కోహ్లీ ఫామ్ జట్టుకు చాలా అవసరమని, ఎక్కువగా భారీ షాట్లకు వెళ్లకుండా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని కెప్టెన్ రోహిత్ కొనియాడాడు. టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు జట్టుకిది శుభసూచకమని చెప్పాడు.'మేం టీ20 ఫార్మాట్ అనగానే ధాటిగా ఆడటం ముఖ్యం అనుకున్నాం. కానీ విరాట్ మాకు మరో కోణం చూపించాడు. క్రీజులో సెట్ అయిన తర్వాత కూడా ధాటిగా ఆడవచ్చని, పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడం ఎంత అవసరమో అనే విషయాన్ని ఈ మ్యాచ్ ద్వారా మాకు చూపించాడు.'అని రోహిత్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications