
సెంచూరియన్: బౌలర్ల అద్భుత ప్రదర్శనకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ సూపర్ బ్యాటింగ్ తోడవడంతో సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో విజయం సాధించామని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 113 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా కోటలను బద్దలు చేసిన కోహ్లీసేన.. సెంచూరియన్ వేదికగా టెస్ట్ విజయం అందుకున్న తొలి ఆసియా జట్టుగా రికార్డుకెక్కింది. అంతేకాకుండా మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచి మూడు దశాబ్దాల కలకు అడుగు దూరంలో నిలిచింది.
మ్యాచ్ అనంతరం ఈ విజయంపై స్పందించిన విరాట్ కోహ్లీ.. క్రెడిట్ అంతా బౌలర్లదేనని చెప్పాడు. ముఖ్యంగా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ వరల్డ్ క్లాస్ బౌలరని, టాప్-3 పేసర్లలో అతను ఒకడని కొనియాడాడు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌లు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రాణించడం జట్టు విజయానికి దోహదం చేసిందన్నాడు. 'సౌతాఫ్రికా పర్యటనలో మాకు శుభారంభం దక్కింది. వర్షం కారణంగా ఒక రోజు ఆట (రెండో రోజు) పూర్తిగా తుడిచిపొట్టుకుపోయినా మేము చాలా బాగా ఆడాం.
సెంచూరియన్‌లో సౌతాఫ్రికాతో ఆడటం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. విదేశాల్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం సవాలుతో కూడుకున్నది. తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు సాధించడానికి మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ కారణం. బౌలర్లు రాణిస్తారని మాకు తెలుసు. క్లిష్ట పరిస్థితుల్లో మా బౌలర్లు సమష్టిగా బౌలింగ్ చేయడంతో జట్టు ఈ ఫలితాన్ని పొందింది. షమి కచ్చితంగా అద్భుతమైన, ప్రపంచస్థాయి బౌలర్. ప్రస్తుతం ప్రపంచంలోని ముగ్గురు అత్యుత్తమ పేసర్లలో అతను ఒకడు' అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
305 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు.. 191 పరుగులకే కుప్పకూలింది. ఆతిథ్య జట్టులో కెప్టెన్ డీన్ ఎల్గర్(77), టెంబా బవుమా(35 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా (3/50), మహమ్మద్ షమీ(3/63) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/47), రవిచంద్రన్ అశ్విన్(2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు. సూపర్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ జనవరి 3 నుంచి జోహన్నెస్ బర్గ్ వేదికగా జరగనుంది.