Virat Kohli: 2011 తర్వాత మళ్లీ ఇప్పుడే! ఇక టాప్-2 మా టార్గెట్!

షార్జా: ఐపీఎల్ 2021 సీజన్‌లో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే ప్లే ఆఫ్స్ చేరడం సంతోషంగా ఉందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. 2011 తర్వాత తమ జట్లు మళ్లీ పలు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ చేరిందన్నాడు. పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో గెలుపొందిన ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన కోహ్లీ.. తమ తదుపరి టార్గెట్ టాప్-2లో నిలవడమేనని చెప్పాడు. తామ ఆటలో ఇంకా కొన్ని లోపాలున్నాయని, వాటిని సరిచేసుకొని టాప్‌లో నిలిచేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు.

12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు..
'2011 తర్వాత మళ్లీ కొన్ని మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ చేరడం సంతోషంగా ఉంది. 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించడం గొప్పగా ఉంది. ఇప్పుడు మాకింకా రెండు మ్యాచ్‌లు ఉండటంతో పాయింట్ల పట్టికలో టాప్ రెండులో నిలిచే అవకాశం ఉంది. అదే జరిగితే మా ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. అయితే, ఏ జట్టుకైనా తొలి అడ్డంకి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడమే. అది ఇప్పుడు మేం దాటేశాం. కానీ, మా ఆటలో దృష్టి సారించాల్సిన లోపాలున్నాయి. మిగతా మ్యాచ్‌ల్లో వాటిని సరిదిద్దుకొని టాప్ 2లో నిలవడానికి ప్రయత్నిస్తాం.

ఆ రెండు వికెట్లు తీస్తే..
ఈ పిచ్‌పై 15 నుంచి 20 పరుగులు కూడా కీలకంగా మారతాయి. ఈ పిచ్ ఆడేకొద్దీ నెమ్మదిస్తుందని తెలుసు. ధాటిగా ఆడటం అంత తేలిక కాదని అర్థమైంది. ఇక పంజాబ్ జట్టులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ బాగా ఆడారు. అయితే, ఈ రెండు వికెట్లు తీస్తే మళ్లీ మేం ఈ మ్యాచ్‌లో కమ్ బ్యాక్ చేస్తామని తెలుసు. ఈ క్రమంలోనే మా బౌలర్లు సరైన సమయంలో చెలరేగి వికెట్లు తీశారు. సిరాజ్, హర్షల్, చాహల్, షాబాజ్, గార్టన్ అంతా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈసారి మా ఆటగాళ్లు ఎవరికి వారు సొంతంగా బాధ్యత తీసుకొని ఆడారు. అందుకు సంతోషంగా ఉంది. ఇదే జోరును మున్ముందు కూడా కొనసాగిస్తాం' అని విరాట్ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

మ్యాడ్ మ్యాక్సీ...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్(33 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. దేవదత్ పడిక్కల్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), విరాట్ కోహ్లీ(24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25), ఏబీ డివిలియర్స్(18 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 23) రాణించారు. పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమీ(3/39), మోయిసెస్ హెన్రీక్స్(3/12) మూడేసి వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేసింది. మయాంక్ అగర్వాల్(42 బంతుల్లో 57), కేఎల్ రాహుల్(35 బంతుల్లో 39) రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(3/29) మూడు వికెట్లు తీయగా.. జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్ చెరొక వికెట్ పడగొట్టారు. హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మ్యాక్సీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications