అలా అనుకుంటే మేం విమానం ఎక్కడమే దండుగ: విరాట్ కోహ్లీ

ముంబై: ఇంగ్లండ్ గడ్డపై న్యూజిలాండ్‌కు అడ్వాంటేజ్ ఉంటదని భావిస్తే తాము విమానం ఎక్కడమే అనవసరమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇరు జట్లకు సమాన అవకాశాలున్నాయని తెలిపాడు. న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్, ఆపై ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్... సుమారు మూడున్నర నెలల పాటు సాగే ఈ పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు బుధవారం అర్థరాత్రి ప్రత్యేక విమానంలో బయలుదేరింది. డబ్ల్యూటీసీ ఫైనల్ తొలిసారి జరుగుతుండగా... 2018 తర్వాత ఇంగ్లండ్‌లో టీమిండియా టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు బుధవారం జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్రాక్టీస్ లేదనే బెంగ లేదు..
ఈ పర్యటన కోసం మేం సరిగా సన్నద్ధం కాలేదనే అంశం గురించి ఎలాంటి ఆందోళన లేదు. సిరీస్ ప్రారంభానికి కేవలం మూడు రోజుల ముందు ప్రత్యర్థి దేశంలో అడుగు పెట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అలా వెళ్లి కూడా సిరీస్‌లో హోరాహోరీగా తలపడ్డాం. కాబట్టి ఇదంతా మాకు తెలుసు. ఇంగ్లండ్‌లో మొదటిసారి ఆడటం లేదు. అక్కడి పరిస్థితుల గురించి బాగా తెలుసు. పరిస్థితులు ఎలా ఉన్నా సరైన మానసిక దృక్పథంతో మైదానంలోకి అడుగు పెట్టడం ముఖ్యం. లేదంటే తొలి బంతికే అవుట్ కావచ్చు లేదా వికెట్లు తీయడం అసాధ్యంగా మారిపోవచ్చు.

అలా అనుకుంటే వెళ్లడం వేస్ట్..
మ్యాచ్‌కు ముందు నాలుగు ప్రాక్టీస్ సెషన్లకు మాత్రమే అవకాశం లభించినా ఎలాంటి కంప్లైట్ చేయం. ఎందుకంటే ఒక జట్టుగా మేం ఏం చేయగలమో మాకు బాగా తెలుసు. సీనియర్ లేదా 'ఎ' జట్టు సభ్యులుగా అందరికీ ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. టెస్టు క్రికెట్ బాగా ఆడితే పరిస్థితులు పెద్ద సమస్య కాదు. ఆస్ట్రేలియా గడ్డపై అంతా వారికి అనుకూలంగా ఉంటే మేం గెలవలేదా. మాకన్నా ముందు న్యూజిలాండ్ అక్కడ టెస్టులు ఆడుతోంది కాబట్టి వారికి అనుకూలత ఉందంటే నేను నమ్మను. అలా గనక భావిస్తే మేం ఇక్కడి నుంచి విమానం ఎక్కడమే అనవసరం. నా దృష్టిలో ఇద్దరికీ సమానావకాశాలు ఉన్నాయి.

మానసికంగా ప్రభావం..
బయో బబుల్ ఆటగాళ్లపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే దేశపు రెండు జట్లు ఒకే సమయంలో రెండు వేర్వేరు చోట్ల ఆడటం తప్పనిసరిగా మారిపోవచ్చేమో. మైదానంలో తీవ్రమైన ఒత్తిడి మధ్య ఆడి వచ్చిన తర్వాత హోటల్ గదికే పరిమితం కావడం, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండిపోవడం మానసికంగా చాలా ఇబ్బందికరం. ఆటకు దూరంగా కొద్దిసేపు ప్రశాంతంగా గడిపి కొత్త ఉత్సాహంతో రావడం అసాధ్యంగా మారింది. ఈ జట్టుకు గొప్పగా తీర్చిదిద్దడంలో మేం ఎంతో శ్రమించాం. అలాంటిది మానసిక సమస్యలతో ఆటగాళ్లు కుప్పకూలిపోవడం లాంటివి చూడలేం. నేను మానసికంగా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి కొంత విరామం కావాలని ఆటగాడు అడిగితే మేనేజ్‌మెంట్ సానుకూలంగా స్పందించే పరిస్థితి రావాలని కోరుకుంటున్నా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications