మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ విజయంతో ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడాడు. ఈ గెలుపుతో ప్రతీ భారతీయుడు గర్వ పడుతున్నాడని, ఈ విజయానికి భారత అమ్మాయిలు పూర్తి అర్హులని పేర్కొన్నాడు. ఈ మేరకు కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు. ప్రపంచకప్‌తో ఉన్న మహిళల జట్టు ఫొటోను కూడా పంచుకున్నాడు.
'భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. మీ ఫియర్‌లెస్ క్రికెట్, ఆత్వ విశ్వాసంతో ప్రతి భారతీయుడి గర్వించేలా చేశారు. మీరు అన్ని ప్రశంసలకు అర్హులు.ఈ క్షణాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించండి. హర్మన్ సేన అద్భుత ప్రదర్శన కనబర్చింది. జై హింద్.'అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లీతో పాటు క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా భారత విజయాన్ని సోషల్ మీడియా వేదికగా కొనియాడారు.

'1983 సంవత్సరం ఒక తరాన్ని పెద్ద కలలు కనడానికి, వాటిని నెరవేర్చుకునేందుకు స్ఫూర్తినిచ్చింది. నేడు మన మహిళల క్రికెట్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న యువతులు బ్యాట్, బాల్ పట్టి మైదానంలో అడుగుపెట్టడానికి, తాము కూడా ఒక రోజు ట్రోఫీని గెలవగలమనే నమ్మకం కలిగిలే ఈ విజయం స్ఫూర్తినిచ్చింది. భారత మహిళల క్రికెట్ ప్రయాణంలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. టీమిండియా చాలా బాగా ఆడింది. దేశం మొత్తం గర్వపడేలా చేసింది.'అని సచిన్ ట్వీట్ చేశాడు.
భారత మహిళల జట్టు కేవలం చరిత్ర సృష్టించలేదని, భవిష్యత్తులో ఆడపిల్లలకు స్ఫూర్తినిచ్చే ఒక మహత్తర వారసత్వాన్ని నెలకొల్పారని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.
'భారత క్రికెట్‌కు ఇదో చారిత్రక ఘట్టం. మన మహిళల జట్టు పట్టుదల, ఓర్పు, విశ్వాసంతో ఏదైనా సాధిస్తుందని ప్రంపంచానికి చూపించారు. వారికి నా అభినందనలు'అని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ట్వీట్ చేశాడు.
'ఈ జట్టు చూపిన అసాధారణ ధైర్యం, విశ్వాసం అద్భుతం. మీరు దేశం మొత్తాన్ని గర్వపడేలా చేశారు. ఛాంపియన్స్, మీకు హృదయపూర్వక అభినందనలు'అని టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేర్కొన్నాడు.