భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓ బుజ్జి అభిమాని కలిసాడు. ఆ బుడ్డోడు అచ్చం విరాట్ కోహ్లీలానే ఉండటంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. విరాట్ కోహ్లీ డూప్లికేట్, జిరాక్స్ అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.
అయితే విరాట్ కోహ్లీ.. కూడా ఆ బుజ్జి అభిమాని తనలా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడట. పక్కనే ఉన్న రోహిత్ శర్మతో ఆ కుర్రాడి గురించి చెప్పాడట. 'రోహిత్.. నా డూప్లికేట్ అక్కడు కూర్చొని ఉన్నాడు. నా బుజ్జి చీకు అక్కడ ఉన్నాడు.'అని కోహ్లీ అనగా.. రోహిత్ పగలబడి నవ్వాడట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సదరు అభిమాని పేరు కూడా చీకు అంట. విరాట్ కోహ్లీ నిక్ నేమ్ కూడా చీకు అన్న సంగతి తెలిసిందే. తనలా ఉన్న ఆ చిన్నారి అభిమానిని చూసి కోహ్లీ మురిసిపోయాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగుల భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్(71 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84), డెవాన్ కాన్వే(67 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56), హెన్రీ నికోల్స్(69 బంతుల్లో 8 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(2/40), హర్షిత్ రాణా(2/65), ప్రసిధ్ కృష్ణ(2/60) రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లకు 306 పరుగులు చేసి గెలుపొందింది.. విరాట్ కోహ్లీ(91 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 93) తృటిలో శతకం చేజార్చుకోగా.. శుభ్‌మన్ గిల్(71 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రేయస్ అయ్యర్(47 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. హర్షిత్ రాణా(23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29), కేఎల్ రాహుల్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జెమీసన్(4/41) నాలుగు వికెట్లు తీయగా.. ఆదిత్య అశోక్, క్రిస్టన్ క్లార్క్ తలో వికెట్ తీసారు.
ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. మంగళవారమే భారత జట్టు రాజ్ కోట్ చేరుకుంది. ఈ రోజు సాయంత్రం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొననుంది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్.. రెండో వన్డే కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది.