
లండన్: ఇంగ్లండ్ గడ్డపై పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియా వేదికగా సానుభూతి వ్యక్తమవుతోంది. కోహ్లీని జట్టు నుంచి తీసేయాలంటూ కపిల్ దేవ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు విమర్శిస్తున్న నేపథ్యంలో వరల్డ్ క్లాస్ ప్లేయర్లు స్పందిస్తున్నారు. కోహ్లీకి మద్దతుగా నిలుస్తూ త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడని ట్వీట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కెరీర్‌లో విషమ దశను ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీకి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అండగా నిలిచాడు. ఫామ్ కష్టాలు త్వరలో సమసి పోతాయి.. ధైర్యంగా ఉండు అంటూ ట్వీట్ చేశాడు.
దీనిపై విరాట్ కోహ్లీ స్పందించాడు. ధన్యవాదాలు తెలుపుతూ బాబర్ తన జోరును కొనసాగించాలని ఆకాంక్షించాడు. 'థ్యాంక్యూ బాబర్.. నువ్వు ఇలాగే రాణిస్తూ, మరింత ఎదుగుతూ ఉండాలి.. ఆల్ ది బెస్ట్.'కోహ్లీ బదులిచ్చాడు. కోహ్లీ మంచిని కోరుతూ బాబర్ చేసిన ట్వీట్‌పై విరాట్ కోహ్లీ స్పందించాల్సిందని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది, మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కామెంట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే కోహ్లీ రిప్లై ఇవ్వడం గమనార్హం.
ఇక క్రికెట్‌లో తన రోల్‌మోడల్ విరాట్ కోహ్లీనే అని, తన ఆరాధ్య దైవం అతనేనని బాబర్ ఆజామ్ ఇప్పటికే చాలా సందర్భాల్లో వెల్లడించాడు. కోహ్లీ సైతం తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చి ఈ పాక్ బ్యాటర్‌ను ప్రోత్సహించాడు. ప్రస్తుతం ఫార్మాట్లకు అతీతంగా బాబర్ చెలరేగుతున్నాడు. కోహ్లీ మాదిరే సూపర్ బ్యాటింగ్‌తో పాకిస్థాన్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. కెరీర్‌లో అత్యుత్తమ స్థాయికి చేరినా.. కోహ్లీనే తన ఫేవరట్ అంటూ చెబుతున్న బాబర్.. కోహ్లి బ్యాటింగ్ చూస్తూనే తాను ఎదిగానంటూ పలు సందర్భాల్లో వెల్లడించాడు. బాబర్ ప్రస్తుతం కెరీర్‌లో అత్యుత్తమ దశలో కొనసాగుతుండగా.. కోహ్లీ మాత్రం దుర్భర దశను ఎదుర్కొంటున్నాడు.
అంతకుముందు విమర్శకులను ఉద్దేశించి విరాట్ తనదైన శైలిలో ఓ ట్వీట్ చేశాడు. ఘాటు పదాలు వాడకుండానే సుతిమెత్తని సూక్తితో ఆలోచనలో పడేసాడు. డార్లింగ్ అంటూనే గట్టిగా ఏసుకున్నాడు. 'డార్లింగ్.. నేను కింద పడితే ఏంటి.. నువ్వు పైకి ఎగిరితే ఏంటి..?'అంటూ విమర్శకులను ఉద్దేశించి ఓ ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.