

ముంబై: ఐపీఎల్-2022 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సరిగ్గా లీగ్ ప్రారంభానికి ముందు ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి తన ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ ప్రేమికులందరికీ షాకిచ్చాడు. టీమ్‌లో తనకెంతో నమ్మకస్తుడైన రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు. దాంతో కెప్టెన్సీ అనుభవమే లేని జడేజా చెన్నైని నడిపించనున్నాడు. అయితే జడేజా కెప్టెన్ రాణించడంపై విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ సందేహం వ్యక్తం చేశాడు.
రవీంద్ర జడేజా అత్యుత్తమ ఆల్‌రౌండర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని, అయితే గొప్ప ఆటగాడు గొప్ప కెప్టెన్ అవ్వాలన్న రూలేమీ లేదని వ్యాఖ్యానించాడు. తాజాగా ఖేల్ నీతి యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన రాజ్‌కుమార్ శర్మ.. 'రవీంద్ర జడేజా ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే, కెప్టెన్‌గా అతనికి ఎక్కువ అనుభవం లేదు. నిజం చెప్పాలంటే.. ఓ మంచి ఆటగాడు.. మంచి కెప్టెన్ అవుతాడని కచ్చితంగా చెప్పలేం. అంతేకాదు గొప్ప కెప్టెన్ ఒక్కోసారి మంచి ప్లేయర్ కూడా కాకపోవచ్చు.
అయితే, అతనికి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. కాబట్టి టీమ్‌ను ఎలా మేనేజ్ చేసుకోవాలో కనీస అవగాహన ఉండటం సహజం. అంతేగాక ఎంఎస్ ధోనీ జట్టులో ఉండనే ఉన్నాడు. జడేజాకు అతను మార్గనిర్దేశనం చేస్తాడు'' అని చెప్పుకొచ్చాడు. కాగా మార్చి 26న డిఫెండింగ్ చాంపియన్ సీఎస్‌కే- కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది.