
న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దేనికీ ఆశపడడని.. ఆటకు వంద శాతం న్యాయం చేస్తాడని అతని చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అన్నాడు. కొద్దిరోజులుగా భారత క్రికెట్‌లో నెలకొన్న పరిస్థితులు, విరాట్ కోహ్లీకి, బీసీసీఐకి మధ్య కొనసాగుతున్న వివాదంపై ఆయన స్పందించాడు. విరాట్ కోహ్లీ ఒక్కసారి మైదానంలోకి దిగితే ఈ విషయాలన్నీ మర్చిపోతాడని,అతను అంకితభావంతో క్రికెట్ ఆడతాడని చెప్పుకొచ్చాడు. ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రాజ్‌కుమార్ శర్మ.. కోహ్లీ వ్యక్తితత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఈ వివాదం కోహ్లీ మైండ్‌లో ఎక్కడో ఓ మూలన ఉంటుంది. కానీ, ఒక్కసారి బరిలోకి దిగితే అవన్నీ మర్చిపోతాడు. అయితే, ఇదంతా అతని ఆటను దెబ్బతీస్తుందని నేను అనుకోను. అతనికి అమితమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. అలాగే ఆటకు వంద శాతం న్యాయం చేస్తాడనే నమ్మకం కూడా ఉంది. మరోవైపు ఏ ఆటగాడికైనా ఇలాంటి వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. అయితే, ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ.. బీసీసీఐ జాగ్రత్తగా వ్యవహరిస్తుందని భావిస్తున్నా. ఇలాంటి అనవసర రాద్దాంతం టీమిండియాలో ఉండకూడదనే నా అభిప్రాయం' అని రాజ్‌కుమార్ శర్మ చెప్పుకొచ్చాడు. రెండు వైపుల సమన్వయం పాటించి ఉంటే ఈ పరిస్థితినే వచ్చేది కాదన్నాడు. కోహ్లీ వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో వారి మధ్య సమన్వయలోపం లేకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. అసలేం జరిగిందనే విషయంపై ఇరువురి మధ్య పారదర్శకత ఉండాల్సిందని చెప్పుకొచ్చాడు.
వన్డే కెప్టెన్సీ మార్పుతో చెలరేగిన ఈ చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదు. సౌతాఫ్రికా పర్యటనకు వెళ్తూ వెళ్తూ టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ వివాదానికి మరింత ఆజ్యంపోసాడు. దాంతో కోహ్లీ X రోహిత్‌గా ఉన్నపరిస్థితి కోహ్లీ X బీసీసీఐగా మారింది. సౌతాఫ్రికా ఫ్లైట్ ఎక్కేముందు మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. బోర్డుపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని తనను ఎవరు అడగలేదని, వన్డే కెప్టెన్సీ వేటు గురించి టెస్ట్ టీమ్ సెలెక్షన్ అప్పుడే చెప్పారని ప్రకటించాడు. టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని విరాట్‌ను రిక్వెస్ట్ చేశామంటూ అంతకుముందు బోర్డు ప్రెసిడెంట్ సౌరవ్ చేసిన వ్యాఖ్యలకు ఇవి పూర్తి వ్యతిరేకంగా ఉండటంతో బీసీసీఐ పెద్దలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.అంతేకాకుండా బోర్డు, విరాట్ మధ్య అసలేం జరుగుతోందనే చర్చ కూడా మొదలైంది.
ఈ నేపథ్యంలో తన హోమ్ టౌన్ కోల్‌కతాలో మీడియా ఎదుటపడిన దాదా.. ఈ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించాడు. 'ఎలాంటి ప్రకటన చేసేది లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లు లేవు. మేమే ఈ సమస్యను పరిష్కరించుకుంటాం. విషయాన్ని బీసీసీఐకి వదిలేయండి' అంటూ వెళ్లిపోయాడు. దాంతో, విరాట్, బీసీసీఐ మధ్య మొదలైన వార్ ఎలా ముగుస్తుందోనని క్రికెట్ ఫ్యాన్స్ టెన్షన్‌లో ఉన్నారు.