టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌పై విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో2-1తో టీమిండియా ఓటమి పాలైన నేపథ్యంలో వికాస్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ పోస్ట్ పెట్టాడు.
ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. భారత గడ్డపై తొలి వన్డే సిరీస్ గెలిచి 38 ఏళ్ల కలను నెరవేర్చుకుంది. న్యూజిలాండ్ విధించిన 338 పరుగుల లక్ష్యఛేధనలో భారత్ 296 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ(108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 124) సెంచరీతో చెలరేగినా..నితీష్ కుమార్ రెడ్డి(57 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53), హర్షిత్ రాణా(43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది.

విరాట్ కోహ్లీ ఈజీ ఫార్మాట్ ఎంచుకున్నాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించాడు. తన లోపాలను సరిదిద్దుకోకుండా టెస్ట్‌లకు వీడ్కోలు పలికాడని అభిప్రాయపడ్డాడు. జోరూట్, విలియమ్సన్, స్మిత్.. టెస్ట్ క్రికెట్‌లో రాణిస్తుంటే కోహ్లీ మాత్రం సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడని తక్కువ చేసి మాట్లాడాడు.
విరాట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినా బాగుండేదని, కానీ టాపార్డర్ బ్యాటర్‌కు ఎంతో సులువైన వన్డేల్లో కొనసాగడం తనను మరింత నిరాశకు గురి చేసిందన్నాడు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనే సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వికాస్ కోహ్లీ కూడా సంజయ్ మంజ్రేకర్ పేరు ప్రస్తావించుకుండా ఘాటుగా బదులిచ్చాడు. 'కొందరికి కోహ్లీ పేరు ఎత్తకపోతే పూట గడవదు అన్నట్లుగా ఉంది పరిస్థితి'అని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ థ్రెడ్స్‌లో పోస్ట్ పెట్టాడు.
తాజాగా వన్డే సిరీస్‌లో భారత్ ఓడిపోవడంతో వికాస్ కోహ్లీ మరోసారి సంజయ్ మంజ్రేకర్‌పై సెటైర్లు పేల్చాడు. స్టూడియోలో కూర్చొని ఏదైనా మాట్లాడటం సులువని, మైదానంలోకి దిగితేనే అసలు విషయం తెలుస్తుందని చురకలింటిచాడు. 'మిస్టర్ క్రికెట్ ఎక్స్‌పర్ట్.. నీ దగ్గర అత్యంత సులువైన ఫార్మాట్ గురించి ఏవైనా సూచనలు ఉన్నాయా? అయినా అవి చేయాలంటే మీరు మైదానంలో ఉండాలి కదా? ఏదేమైనా.. చెప్పడం సులభం.. కానీ చేయడమే కష్టం.'అని పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
