
రెండు ట్రిపుల్ సెంచరీలు చెన్నైలోనే
భారత క్రికెట్ చరిత్రలో మూడు ట్రిపుల్ సెంచరీలు నమోదైతే.. అందులో రెండు చెన్నైలోని చెపాక్ స్టేడియంలోనే నమోదయ్యాయి. 2008లో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వీరవిహారం చేస్తే.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ 2016లో సునామీ సృష్టించాడు. ఈ రెండు సందర్భాల్లోనూ బలమైన ప్రత్యర్థులపైనే భారత ఆటగాళ్లు విజృంభించారు. ఈ స్టేడియంలో వీరేంద్ర సెహ్వాగ్ (319) దక్షిణాఫ్రికాపై ట్రిపుల్ సెంచరీ సాధించగా.. నాయర్ (303) ఇంగ్లాండ్‌పై కెరీర్లోనే తొలి ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. ఇక టీమిండియా అత్యధిక స్కోరు (759/7) నమోదైంది కూడా చెపాక్ వేదికగానే.

సెహ్వాగ్ వీరవిహారం
టీమిండియా తరఫున నమోదైన మూడు త్రిశతకాల్లో రెండు వీరేంద్ర సెహ్వాగే సాధించాడు. వీరూ 2004లో ముల్తాన్ స్టేడియంలో పాకిస్థాన్‌పై తొలి ట్రిపుల్ శతకం (309) బాదాడు. ఆ తర్వాత నాలుగేళ్లకే చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో మరో త్రిశతకాన్ని అందుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 540 పరుగులు చేసింది. అషిమ్ ఆమ్లా 159 పరుగులు చేశాడు. దీంతో భారత్‌కు కష్టాలు తప్పవని భావించారంతా. కానీ సెహ్వాగ్ ఇన్నింగ్స్‌ను చూసిన తర్వాత కష్టాలు టీమిండియాకు కాదు సఫారీలకు అనేలా పరిస్థితి మారిపోయింది. 42 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 319 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి తోడుగా ఇండియన్ వాల్ రాహుల్ ద్రవిడ్ శతకంతో కదంతొక్కగా భారత్ 627 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రాణించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

చెన్నైలోనే నాయర్ త్రిశతకం
సెహ్వాగ్ భారీ ఇన్నింగ్స్ సాధించిన ఎనిమిదేళ్ల తర్వాత యువ ఆటగాడు కరుణ్ నాయర్ చెన్నైలోనే త్రిశతకం చేశాడు. 2016లో భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్‌పై చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 477 పరుగులు చేసింది. మొయిన్ అలీ 146 పరుగులు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 759/7 రికార్డు స్కోరు నమోదు చేసింది. అయిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కరుణ్ నాయర్ (303) పరుగుల వరద పారిస్తూ ట్రిపుల్ సెంచరీ చేశాడు. కేఎల్ రాహుల్ (199) కూడా చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 207 పరుగులకే ఆలౌటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

రోహిత్, కోహ్లీ త్రిశతకం సాధిస్తారా?
కరుణ్ నాయర్ తర్వాత భారత్ తరఫున ఇప్పటివరకు ట్రిపుల్ ఎవరూ సాధించలేదు. ప్రస్తుత భారత జట్టులో స్టార్ బ్యాట్స్‌మన్‌కు కొదవలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, చేటేశ్వర్ పుజారా, అజింక్య రహానే సీనియర్ ఆటగాళ్లతో పాటు లోకేష్ రాహుల్, గిల్, మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లంతా సంచనాలను సృష్టించగలిగే బ్యాట్స్‌మెన్. వీరంతా ఫాంలో ఉండడం భారత్‌కు ప్రస్తుతం బాగా కలిసి వస్తున్న అంశం. మరో విశేషం ఏంటంటే వీరిలో ఏ ఒక్కరూ కూడా ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించలేదు. దీంతో ఈ సారయినా వీరిలో ఎవరైనా ట్రిపుల్ మోజు తీర్చుకుంటారేమో చూడాలి.
ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి టీమిండియా.. రేసులో అక్షర్, సుందర్! రిజర్వ్ బెంచ్‌కే హార్దిక్!


Click it and Unblock the Notifications












