సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపర్చారు. టీ20, టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన ఈ మాజీ కెప్టెన్లు కేవలం వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాంతో ఐపీఎల్ 2025 తర్వాత ఇంటికే పరిమితమైన రోహిత్, కోహ్లీలు నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు అందుబాటులోకి వచ్చారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ, రోహిత్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చారు.
ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 14 బంతుల్లో 8 పరుగులే చేసి క్యాచ్ ఔటవ్వగా.. విరాట్ కోహ్లీ 8 బంతులు ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. కోహ్లీని స్టార్క్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్(10)ను నాథన్ ఎల్లిస్ క్యాచ్ ఔట్ చేయడంతో టీమిండియా 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(6 బ్యాటింగ్), అక్షర్ పటేల్(7 బ్యాటింగ్) ఉన్నారు. ఈ క్రమంలో వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. వర్షం ఆగిపోయే సమయానికి భారత్ 11.5 ఓవర్లలో 37/3 స్కోర్ చేసింది. ఓవర్‌కాస్ట్ కండిషన్స్‌లో ఆసీస్ బౌలర్లు నిప్పులు చెరిగి ఆశించిన ఆరంభాన్ని అందుకున్నారు.

వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ, రోహిత్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. దాంతో ఈ ఇద్దరి ఆటగాళ్లపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఈ అవమానం మా వల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించేయండి' అని ఒకరంటే.. కోహ్లీ, రోహిత్ వైఫల్యాన్ని తాము చూడలేకపోతున్నామని, ఆట నుంచి గౌరవంగా తప్పుకోవడమే ఉత్తమమని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
'బ్రో మీరు రిటైర్మెంట్ ప్రకటించేయండి'అని హితవు పలుకుతున్నారు. గంభీర్ కోరుకున్నది ఇదేనని, రెండో వన్డేలో కూడా విఫలమైతే తుది జట్టులో చోటు కూడా ఉండదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఆడితే ఇలానే ఉంటుందని, కోహ్లీ, రోహిత్ దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలని హితవు పలుకుతున్నారు. ఒక్క మ్యాచ్‌లోనే విఫలమయ్యారని, ఇంకా రెండు వన్డేలు ఉన్నాయని అభిమానులు ఓపికగా ఉండాలని మరికొందరు సూచిస్తున్నారు.