ముంబైపై విజయంతో మాకు ఊపొచ్చింది : విరాట్ కోహ్లీ
లీగ్ దశలో కాస్త తడబడినా.. ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠపోరులో విజయం సాధించడం తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. గతేడాది ఉన్నంత ఒత్తిడి ఈసారి లేదని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు. ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. తమ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు.
ఒక్కటే చెప్పాం..
'గతేడాది ఉన్నంత ఒత్తిడి ఈసారి లేదని నేను మా జట్టులోని కొందరు ఆటగాళ్లతో అన్నాను. మా గ్రూప్‌లో ఎలాంటి ప్రతిభ ఉందో మాకు బాగా తెలుసు. మేం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచాం. ఫైనల్‌కు అందరికంటే ముందు చేరడానికి ఒక బలమైన కారణం ఉంది. మేం జట్టుతో ఒకటే చెప్పాం. మనం మన సహజసిద్ధమైన క్రికెట్‌ను నమ్ముకుని, మన ప్లాన్స్‌ను సరిగ్గా అమలు చేస్తే.. ఈ టోర్నమెంట్‌లోనే మనది అత్యుత్తమ జట్టుగా నిలుస్తుందన్నాం.

గ్రూప్ స్టేజ్‌లో మేం అంత బాగా రాణించడానికి కారణం ఇదే. అందుకే లీగ్ స్టేజ్‌ను టాపర్స్‌గా ముగించాం. మా ఆటగాళ్ల నైపుణ్యాలు, వారిలోని పరిణతి , ఒత్తిడిని తట్టుకునే మానసిక స్థిరత్వం ఈ రాత్రి మరోసారి మైదానంలో స్పష్టంగా కనిపించాయి. ఇది నిజంగా ఒక అద్భుతమైన సమష్టి ప్రదర్శన.
ముంబైపై విజయంతో..
నిజం చెప్పాలంటే.. బ్రేక్ తర్వాత మేం ఒకటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయాం. అంటే, ఒక మ్యాచ్ ఓడిపోయాక ముంబై ఇండియన్స్‌పై చాలా క్లోజ్ మ్యాచ్‌లో గెలిచాం. ఆ వారం మాకు కొంచెం కష్టంగా అనిపించింది. ఎందుకంటే మేం పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలవాలని బలంగా కోరుకున్నాం. అయితే ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠ పోరులో గెలిచిన తర్వాత మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఆ తర్వాత కేకేఆర్‌పై చాలా భారీ విజయాన్ని నమోదు చేశాం. టేబుల్ టాపర్స్‌గా నిలిచి ఇప్పుడు మళ్లీ టైటిల్ అందుకున్నాం.
మాది అద్భుతమైన జట్టు. ఇలాంటి విజయం కోసం మేం చాలా ఏళ్లు వేచి చూశాం. మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు ప్రతిసారీ మనమే ఒంటరిగా జట్టును గెలిపించాల్సిన అవసరం లేదనే భావన కలిగించే ఆటగాళ్లు చుట్టూ ఉండటం చాలా గొప్ప విషయం. మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించగల ఆటగాళ్లు మీ పక్కన, మీ వెనుక ఉన్నారు.
వరల్డ్ క్లాస్ టీమ్..
మా జట్టులో ఎంతో మంది విభిన్న ఆటగాళ్లకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు రావడం దీనికి నిదర్శనం. మా హేజిల్‌వుడ్, భువి, జాకబ్ డఫీ లాంటి ప్రపంచ స్థాయి బౌలింగ్ లైనప్ ఉంది. ఇక కృనాల్ పాండ్యా విషయానికి వస్తే.. అతను ఎప్పటిలాగే ఎంతో నమ్మదగిన ఆటగాడిగా నిలిచాడు. రసిఖ్ దార్ ఈ సీజన్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
అలాగే బ్యాటర్లందరూ కూడా తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. సరైన సమతుల్యత, తిరుగులేని బలం ఉన్న ఇలాంటి ఆల్‌రౌండ్ స్ట్రాంగ్ టీమ్‌లో ఆడటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. అందుకే ప్రస్తుతం మైదానంలో మేం సత్తా చాటుతున్నాం.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications