11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా ఐసీసీ టైటిల్ గెలిచింది. టీ20 ప్రపంచకప్ 2024లో అసాధారణ ప్రదర్శనతో విజేతగా నిలిచింది. ఫైనల్లో సౌతాఫ్రికాను 7 పరుగులతో ఓడించి రెండోసారి టైటిల్ అందుకుంది. ఈ విజయంతో ఇటు ఆటగాళ్లు, అటు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా అయితే కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ విజయాన్ని భారత ఆటగాళ్లు తమదైన రీతిలో సంబరాలు చేసుకున్నారు. ట్రోఫీతో డ్యాన్స్‌లు చేశారు. ఈ ట్రోఫీతో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఘన వీడ్కోలు తెలిపారు. ఈ విజయానంతరం విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా రోహిత్ శర్మను రిక్వెస్ట్ చేసి టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ ఫొటోలో రోహిత్, కోహ్లీ జాతీయ జెండాను తమ భుజాలపై కప్పుకొని టీ20 ప్రపంచకప్‌కు ఫోజిచ్చారు. అలాగే రోహిత్ శర్మ తన కుమార్తె సమైరాను భుజాలపైకి ఎత్తుకోగా.. విరాట్ కోహ్లీ ప్రపంచకప్ ట్రోఫీని పట్టుకొని వారితో ఫొటోలు దిగాడు. భారత క్రికెట్ చరిత్రలోనే ఈ ఫొటోలు ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోయాయి. తాజాగా ఈ ఐకానిక్ ఫొటో దిగడానికి గల కారణాన్ని విరాట్ కోహ్లీ వెల్లడించాడు.
ప్రపంచకప్‌తో ఇద్దరం కలిసి ఫొటో దిగుదామని తానే రోహిత్‌ను కోరినట్లు కూడా చెప్పుకొచ్చాడు.'టీ20 ప్రపంచకప్ గెలవడం నాకే కాదు. రోహిత్ శర్మకు కూడా చాలా ప్రత్యేకం. అతని కుటుంబం కూడా ఇక్కడ ఉంది. సమైరా అతని భుజాలపై ఉంది. ఈ గెలుపు వెనుక అతని కృషి ఎంతో ఉంది. ట్రోఫీతో ఫోజివ్వమని అతన్ని కోరారు. మా ఇద్దరి ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. అందుకే ఇద్దరం కలిసి ఫొటో దిగాం.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి ఐసీసీ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉండగా.. 2011 వన్డే ప్రపంచకప్ జట్టులో విరాట్ కోహ్లీ ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ విజయానంతరం ఈ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.