
న్యూఢిల్లీ: ట్విటర్‌లో 50 మిలియన్ల ఫోలవర్ల మైలు రాయిని అందుకున్న ఏకైక క్రికెటర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నయా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ ట్విటర్ వేదికగా వాణిజ్య ప్రకటనలను షేర్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నాడు. తాజాగా పుమా కంపెనీ ప్రమోషన్‌లో భాగంగా ఓ వీడియను షేర్ చేసాడు. ఈ వీడియోలో పుమా కంపెనీ గురించి ఏం చెప్పకున్నా.. తన చిన్ననాటి విశేషాలను పంచుకున్నాడు. ముఖ్యంగా గల్లీ క్రికెట్‌లో వాడే పదాలను నెమరువేసుకున్నాడు. బేబీ ఓవర్.. ట్రయల్ బాల్.. అనే పదాలను చిన్నప్పుడు బాగా పలికేవాడినని చెప్పాడు.
బేబీ ఓవర్, ట్రైయల్ బాల్ కాకుండా మరొక పదం 'బట్టా' కూడా ఎక్కువగా వాడేవాళ్లమని తెలిపాడు. తెలుగు ప్రాంతాల్లో 'బట్టా' అనే పదానికి పెద్దగా ప్రాచుర్యంలో లేదు. గల్లీ క్రికెట్‌లో వాడే పదాలకు విరాట్ కోహ్లీ తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. ''చిన్నప్పుడు వాడే క్రికెట్ పదాల గురించి మీకు తెలుసా?' అని సదరు వీడియోలో అభిమానులను కోహ్లీ అడుగుతాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని 'బట్టా' అంటే ఏంటి అని అడుగుతాడు. దానికి విరాట్ బిగ్గరగా నవ్వుతూ.. ''బట్టా అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతుంటారు. బంతిని విసరడం కోసం ఆ పదాన్ని పలుకుతారు. టెన్నిస్ బాల్‌ను కాస్త కఠినంగా విసిరితే 'బట్టా' సంధించాడని అరిచేవాళ్లం'' అని గుర్తు చేసుకున్నాడు.
ఇలాగే 'బేబీ ఓవర్', ట్రయల్ బాల్ గురించి అడగ్గా.. దానికి విరాట్ సమాధానం ఇస్తూ.. ''చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ ముందు బేబీ ఓవర్ అని పిలిచేవాళ్లం. బేబీ ఓవర్‌లో మూడు బంతులు ఉంటాయి. అలాగే ట్రయల్ బాల్ కూడా బాగా వాడేవాళ్లం. ఎవరైనా బ్యాటర్ తొలి బంతికే ఔటైనప్పుడు దానిని ట్రయల్ బాల్‌గా చెప్పేవాడు. నేను చాలాసార్లు బేబీ ఓవర్లు, ట్రయల్ బాల్స్‌ను ఆడాను'' అని కోహ్లీ వివరించాడు. గల్లీ క్రికెట్‌లో తాను బాగా తొండాట ఆడేవాడినని, ఔటైతే.. ట్రయల్ బాల్ అంటూ రచ్చ చేసి మళ్లీ బ్యాటింగ్ చేసేవాడినని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.
6 వారాల పాటు ఆటకు దూరంగా ఉండి ఆసియాకప్ బరిలోకి దిగిన కోహ్లీ దుమ్ము రేపాడు. మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ సెంచరీ కూడా అందుకున్నాడు. సూపర్ ఫామ్‌లోకి వచ్చిన అతను.. టీ20 ప్రపంచకప్ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 20 నుంచి ఆసీస్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. అనంతరం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లోనూ బరిలోకి దిగనున్నాడు.