కోహ్లీ ఆడింది 2 మ్యాచ్‌లే.. కానీ గొప్ప రికార్డులు సాధించాడు!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో భారత ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ నయా రూల్ నేపథ్యంలో 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగాడు. ఢిల్లీ తరఫున రెండే మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ రికార్డుల మోత మోగించాడు.
ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాదిన కోహ్లీ(131).. గుజరాత్‌తో తృటిలో(77) సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ క్రమంలో అతను పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
15 ఇన్నింగ్స్‌ల్లోనే అతను ఈ ఫీట్ సాధించడం గమనార్హం. ఈ టోర్నీలో అతను 1027 పరుగులు చేశాడు. కర్ణాటక లెఫ్టార్మ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో 15 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ రికార్డ్‌ను కోహ్లీ సమం చేశాడు. 2019లో జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ విజయ్ హజారే ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతను 31 మ్యాచ్‌ల్లో 2304 పరుగులు చేశాడు. మొత్తం 36 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 81.51 సగటు, 11 శతకాలు, 12 హాఫ్ సెంచరీలతో 2364 పరుగులు సాధించాడు.

సోమవారం సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. జనవరి 6న రైల్వేస్‌తో జరిగే ఆరవ గ్రూప్ ఏ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ధ్రువీకరించారు. చిన్న వయసులోనే భారత జట్టు తరఫున ఆడటం ప్రారంభించిన విరాట్ కోహ్లీ.. విజయ్ హజారే ట్రోఫీలో ఎక్కువగా ఆడలేకపోయాడు. గత 15 ఏళ్లుగా అతను ఒక్క విజయ్ హజారే మ్యాచ్ కూడా ఆడలేదు. ఆడిన అతికొద్ది మ్యాచ్‌ల్లోనూ అతను రికార్డుల మోత మోగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications