
న్యూఢిల్లీ: ఇన్‌స్టాగ్రామ్ ప్రభావశీల వ్యక్తుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ కన్నా ముందు వరుసలో నిలిచాడు. హైప్ ఆడిటర్స్ రూపొందించిన ప్రపంచ వ్యాప్త వెయ్యి మంది ఇన్‌స్టా ప్రభావశీలుర జాబితాలో పోర్చుగీసు ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో టాప్‌లో నిలవగా.. అర్జెంటీనా సాకర్ స్టార్ మెస్సీ 4వ స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 12వ, ప్రధాని మోదీ 20వ స్థానాల్లో నిలిచారు. బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్లేయర్ నెమార్‌కు 13వ ర్యాంక్ దక్కింది.
ఇక విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన అనుష్క శర్మ భారత్ నుంచి మూడో వ్యక్తిగా ఈ జాబితాలో చోటు దక్కించుకొని 26వ స్థానంలో నిలిచింది. సహచర నటి దీపికా పడుకునే 49వ స్థానంలో ఉండగా.. ఆమె కన్నా అనుష్క 23 స్థానాల్లో ముందు ఉంది.
ఈ ఏడాది ట్విటర్‌లో అత్యధికంగా ప్రస్తావించిన భారత అథ్లెట్‌గా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. పురుషుల జాబితాలో ధోనీ, రోహిత్ శర్మను వెనక్కు నెట్టి విరాట్ ప్రథమ స్థానాన్ని అలంకరించాడు. కాగా, ట్విటర్‌లో ఎక్కువగా ట్వీట్ చేసిన మహిళల్లో బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
ఈ జాబితాలో రెజ్లర్ గీతా ఫొగట్ అగ్రస్థానం దక్కించుకొంది. తన రిటైర్మెంట్ సందర్భంగా ప్రధాని మోదీ రాసిన లేఖకు ధన్యవాదాలు చెబుతూ ధోనీ చేసిన ట్వీట్.. అత్యధికంగా రీట్వీట్ చేసిన ఓ అథ్లెట్ ట్వీట్‌గా నిలిచింది. క్రీడల విభాగంలో ఎక్కువ మంది ఇష్టపడి, కోట్ చేసిన ట్వీట్ అనుష్క ప్రెగ్నెన్సీ వార్త కావడం విశేషం.