Virat Kohli: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలవడంపై ఆ ఫ్రాంచైజీ స్టార్ ప్లేయర్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. శభాష్ స్మృతి మంధాన అంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆర్‌సీబీ జెండాను రెపరెపలాడించి, తలెత్తుకునేలా చేశారని కొనియాడాడు. ఈ విజయం నేపథ్యంలో అభిమానుల కురిపిస్తున్న ప్రేమను అక్కున చేర్చుకోవాలని సూచించాడు.
గురువారం వడోదర వేదికగా జరిగిన డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్లో సమష్టిగా రాణించి ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. 204 పరుగుల రికార్డ్ లక్ష్యాన్ని ఛేదించిన ఆర్‌సీబీ సరికొత్త రికార్డ్‌ను లిఖించింది. ఇది ఆర్‌సీబీ రెండో డబ్ల్యూపీఎల్ టైటిల్ కాగా.. ఆ ఫ్రాంచైజీకి వరుసగా మూడో టైటిల్. డబ్ల్యూపీఎల్ 2024లో ఆర్‌సీబీ తొలి సారి విజేతగా నిలవగా.. ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ తొలిసారి టైటిల్ ముద్దాడింది. తాజా డబ్ల్యూపీఎల్ 2026 సీజన్‌లోనూ ఆర్‌సీబీ విజేతగా నిలవడంతో ఫ్యాన్స్‌కు హ్యాట్రిక్ టైటిల్ దక్కినట్లు అయ్యింది.

ఆర్‌సీబీ సాధించిన ఈ చిరస్మరణీయ విజయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన విరాట్ కోహ్లీ.. స్మృతి సేనను ప్రత్యేకంగా అభినందించాడు. 'మళ్లీ విజేతగా నిలిచాం. ఆర్‌సీబీ జెండాను రెపరెపలాడిస్తూ.. మీ అందరూ మేమంతా గర్వపడేలా చేశారు. ఈ విజయం సాధించిన స్మృతి మంధానతో పాటు జట్టు సభ్యులందరికీ, మేనేజ్‌మెంట్‌కు హృదయపూర్వక అభినందనలు. మీరు నిస్సందేహంగా ఈ విజయానికి అర్హులు. ఈ క్షణాన్ని ఆస్వాదించండి. మన అభిమానులుకురిపిస్తున్న ప్రేమను అక్కున చేర్చుకోండి 'అని విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 203 పరుగులు చేసింది. కెప్టెన్ జెమీమా(37 బంతుల్లో 8 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీ సాధించగా.. లారా వోల్వర్డ్ట్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44), చినెల్ హెన్రీ(15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఆర్‌సీబీ బౌలర్లలో సయాలీ సత్ఘరే(1/46), అరుంధతి రెడ్డి(1/40), నదినే డీ క్లెర్క్(1/48) తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్‌సీబీ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసి గెలుపొందింది. జార్జియో వాల్(54 బంతుల్లో 14 ఫోర్లతో 79), స్మృతి మంధాన(41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87) రెండో వికెట్‌కు 165 పరుగులు జోడించి ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో చినెల్ హెన్రీ(2/34) రెండు వికెట్లు తీయగా.. నందని శర్మ, మిన్ను చెరో వికెట్ పడగొట్టారు. తెలుగు తేజం శ్రీ చరణి(0/46) తీవ్రంగా నిరాశపర్చింది.