హోటల్ బాయ్ నుంచి బస్ డ్రైవర్ వరకు సెంచరీ గురించే విసిగించారు: విరాట్ కోహ్లీ

అహ్మదాబాద్: పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడమే తన సక్సెస్‌కు ప్రధాన కారణమని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. దాంతోనే మూడు ఫార్మాట్లలో రాణించగలుగుతున్నానని చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్‌లో సెంచరీ సాధించిన విరాట్.. మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. 6 సెషన్ల పాటు బ్యాటింగ్ చేసి 186 పరుగులు చేసిన కోహ్లీ కెరీర్‌లోనే అత్యంత స్లో ఇన్నింగ్స్ ఆడాడు. 4 బౌండరీల సాయంతోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. కోహ్లీ విరోచిత బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్ డ్రా కాగా.. భారత్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి విరాట్ చిట్ చాట్ చేశాడు. తన ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

బ్యాటింగ్ పిచ్.. కానీ
'అహ్మదాబాద్ టెస్ట్ ఇన్నింగ్స్ ముందు కూడా నేను అద్భుతంగా ఆడాను. మంచి ఫామ్‌లోనే ఉన్నాను. నిజాయితీగా చెప్పాలంటే ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. కానీ ఆస్ట్రేలియా ఈ పిచ్‌ను అద్భుతంగా వాడుకుంది. మిచెల్ స్టార్క్, నాథన్ లయన్ క్రియేట్ చేసిన రఫ్‌లను ఉపయోగించుకుంటూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. 7-2 ఫీల్డ్‌తో మాపై ఒత్తిడి తెచ్చింది. నేను మాత్రం ఓపికగా ఆడుతూ నా డిఫెన్స్‌ను నమ్ముకున్నా. టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు నేను ఉపయోగించే టెంప్లెట్ ఇదే. నా డిఫెన్సే అతిపెద్ద బలం. బౌండరీలు అంత సులువుగా రాలేదు. సింగిల్స్, డబుల్స్‌తో సెంచరీ పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది.
ఒకేలా ఆడితే కుదరదు..
ఎప్పుడూ ఒకే మైండ్‌సెట్‌తో ఆడటం మంచిది కాదు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. మూడు ఫార్మాట్లలో నేను రాణించడానికి ప్రధాన కారణం ఇదే. శారీరకంగా మానసికంగా పరిస్థితులను అందిపుచ్చుకోవాలి. పరిస్థితులకు తగ్గట్లు ఆడేందుకు నేను మానసికంగా సిద్దమయ్యా. అహ్మదాబాద్ వికెట్‌పై నేను 6 డబుల్స్ కూడా తీయగలను. అందుకే నేను విభిన్న పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయగలను.

బస్ డ్రైవర్ కూడా..
జట్టు కోసం వీలైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడం, ఎక్కువ పరుగులు చేయడం నా ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే సెంచరీ రావాలనుకుంటా. అంతేగానీ రికార్డులు, మైలు రాళ్ల కోసం ఎప్పుడూ ఆడను. వాటిపై అసలు ఫోకసే పెట్టను. కానీ సెంచరీకే అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ఇది చాలా క్లిష్టంగా మారుతోంది. హోటల్ బాయ్ నుంచి బస్ డ్రైవర్, లిఫ్ట్‌లో ఉన్న వ్యక్తి వరకు ప్రతీ ఒక్కరూ సెంచరీ గురించే మాట్లాడుతున్నారు.

30 పరుగులు చేసినా..
ఓ సెషన్‌లో నేను 30 పరుగులు చేసినా సంతోషిస్తా. బౌండరీలు కొట్టలేదని ఏ మాత్రం నిరాశకు గురవ్వను. 5-6 సెషన్ల పాటు బ్యాటింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా ఎంత దృడంగా ఉన్నామో తెలుస్తోంది. కఠిన పరిస్థితుల్లో జట్టు కోసం ఆడటాన్ని నేనేప్పుడూ గొప్పగా ఫీలవుతా.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను బీసీసీఐ షేర్ చేయగా వైరల్ అయ్యింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications