
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టీమ్ ఆఫ్ ది దశాబ్దపు అవార్డుల్లో భారత ఆటగాళ్ల హవా కొనసాగింది. మహిళలు, పురుషుల రెండు కెటగిరీల్లో భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. వన్డే, టీ20 ఫార్మాట్లకు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథిగా, టెస్టు జట్టుకు కోహ్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ దశాబ్దపు అత్యుత్తమ టీ20, వన్డే, టెస్టు క్రికెట్ జట్లను ఆదివారం ఐసీసీ ట్విటర్ వేదికగా ప్రకటించింది. టీ20 జట్టులో ధోనీ, కోహ్లీతో పాటు ఓపెనర్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. అలాగే వన్డే ఫార్మాట్‌కు వెల్లడించిన జట్టులో ధోనీ, రోహిత్, కోహ్లీ చోటు సంపాదించారు. దశాబ్దపు టెస్టు జట్టులో భారత్ నుంచి కోహ్లీ, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.
మరోవైపు ఐసీసీ ప్రకటించిన మహిళల జట్టులో భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు. టీ20 ఫార్మాట్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్, పూనమ్ యాదవ్; వన్డే జట్టులో మిథాలీ రాజ్, జులన్ గోస్వామి చోటు సంపాదించారు. రెండు జట్లకు కెప్టెన్ ఆస్ట్రేలియా క్రికెటర్ మెగ్ లానింగ్ ఎంపికైంది.
ఐసీసీ టీమ్ ఆఫ్ ది డెకెడ్ టీమ్స్..
పురుషుల టీ20 జట్టు
రోహిత్ శర్మ, క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), పొలార్డ్, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ
మహిళల టీ20 జట్టు
అలెస్సా హీలి, సోఫిల్ డెవైన్, సుజీ బేట్స్, మెగ్ లానింగ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్, స్టాఫనీ టేలర్, డియాండ్ర డాటిన్, ఎలిసా పెర్రీ, అన్య స్రుబోస్లే, మెగాన్ స్కౌట్, పూనమ్ యాదవ్
పురుషుల వన్డే జట్టు
రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, షకిబ్ అల్ హసన్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, ఇమ్రాన్ తాహిర్, లసిత్ మలింగ
మహిళల వన్డే జట్టు
అలిస్సా హీలి, సుజీ బేట్స్, మిథాలీ రాజ్, మెగ్ లానింగ్ (కెప్టెన్), స్టాఫనీ టేలర్, సారా టేలర్, ఎలిసా పెర్రీ, డేన్ వాన్, మరిజన్నె కప్, జులన్ గోస్వామి, అనిసా మహ్మద్
పురుషుల టెస్టు జట్టు
కుక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, కుమార సంగక్కర, బెన్ స్టోక్స్, రవిచంద్రన్ అశ్విన్, డేల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్