
చెన్నై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ మందలిచ్చాడు. ఇంగ్లండ్‌తో చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న సెకండ్ టెస్టు మూడో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. 106 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. అశ్విన్‌తో కలిసి 8 వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే వికెట్ల మధ్య పరుగు తీసే సమయంలో భారత కెప్టెన్ నిబంధనల్ని అతిక్రమించాడు. దాంతో.. విరాట్ కోహ్లీ వద్దకి వెళ్లిన అంపైర్ నితిన్ మీనన్.. తప్పిదాన్ని చెప్పడంతో పాటు రిపీట్ చేస్తే..? పెనాల్టీ విధిస్తామని హెచ్చరించాడు.
పిచ్ డేంజర్ ఏరియాలో బ్యాట్స్‌మెన్ అడుగులు వేసుకుంటూ వెళ్తే..? తొలుత ఫీల్డ్ అంపైర్లు వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత కూడా టీమ్‌లోని ఏ ఆటగాడైనా.. ఆ తప్పిదాన్ని రిపీట్ చేస్తే.. 5 పరుగుల్ని పెనాల్టీగా విధిస్తారన్న విషయం తెలిసిందే. అంటే.. ప్రత్యర్థి టీమ్ బ్యాటింగ్ చేయక ముందే వారి స్కోరు బోర్డుకి 5 పరుగులు కలుపుతారన్నమాట. ఇటీవల చెపాక్ వేదికగానే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జోప్రా ఆర్చర్ డేంజర్ ఏరియాలో పరుగెత్తాడంటూ.. విరాట్ కోహ్లీనే ఫీల్డ్ అంపైర్‌కి ఫిర్యాదు చేశాడు.
ఇప్పుడు తానే అలా చేయడంతో అంపైర్ మందలించాడు. అయితే తాను అలా పరుగెత్తడానికి గల కారణాన్ని తెలియజేస్తూ అంపైర్ విరాట్‌తో వాదించాడు. సరిగ్గా లంచ్ బ్రేక్‌కు ముందు ఓవర్‌లో ఇది జరగ్గా.. మైదానం వీడే క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్‌తో కూడా ఈ విషయంపై విరాట్ చర్చించాడు.
ఓవర్‌నైట్ స్కోరు 54/1తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టు.. పుజారా(7), రోహిత్ శర్మ (26), రిషభ్ పంత్ (8), అజింక్య రహానె (10), అక్షర్ పటేల్(7) వికెట్లను వరుసగా కోల్పోయింది. మధ్యలో విరాట్- అశ్విన్ అద్భుతంగా రాణించగా.. మొయిన్ అలీ విరాట్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత కుల్దీప్, ఇషాంత్ ఔటైనా.. సిరాజ్ సాయంతో అశ్విన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో భారత్ ఆధిక్యం 471 పరుగులకు చేరింది.