
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఐసీసీ నిబంధనలకు వ్యతిరేకంగా అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన కోహ్లీపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో మంగళవారం ముగిసిన సెకండ్ టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్.. జోరూట్ ఔట్ విషయంలో అంపైర్ నితీన్ మీనన్‌తో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.
రెండో టెస్టు మూడో రోజు చివరి సెషన్లో అక్షర్ పటేల్ వేసిన బౌలింగ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఎల్బీడబ్ల్యూ కోసం భారత జట్టు అప్పీల్ చేసింది. బంతి రూట్ ప్యాడ్‌కు వెనుక భాగంలో తగిలిన తర్వాత కీపర్ రిషభ్ పంత్ క్యాచ్ పట్టాడు. ఫీల్డర్ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో టీమిండియా రివ్యూకు వెళ్లగా.. రీప్లేలో బంతి బ్యాట్‌కు తగలలేదు కానీ ఆఫ్ స్టంప్స్‌కు తాకినట్లు చూపించింది.
దాంతో థర్డ్ అంపైర్ అంపైర్స్ కాల్‌గా ప్రకటించి ఫీల్డ్ అంపైర్ నిర్ణయం సరైందేనని ప్రకటించాడు. దాంతో అంపైర్ మీనన్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి రవిశాస్త్రి కూడా ఔటేనన్నట్లు సైగలు చేశాడు.
అయితే ఐసీసీ నిబంధనలు ఆర్టికల్ 2.8 ప్రకారం మైదానంలో అంపైర్లతో వాగ్వాదానికి దిగినా.. అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినా తప్పిదమే. దాంతో ఈ నిబంధన కింద విరాట్ కోహ్లీపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశంఉంది. నాలుగు డీ-మెరిట్ పాయింట్లు ఇచ్చే అవకాశం ఉంది. కోహ్లీ పేరు మీద ఇప్పటికే రెండు డీ-మెరిట్ పాయింట్లు ఉన్నాయి.
నిబంధనల ప్రకారం 24 నెలల్లో ఈ డీ-మెరిట్ పాయింట్లు నాలుగుకు చేరితే సదరు క్రికెటర్ ఒక టెస్టు లేదా రెండు వన్డే, టీ20లకు సస్పెన్షన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఇక సెకండ్ టెస్ట్‌లో భారత్ 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే.