టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లీ బాధ్యతలు చేపట్టనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టెస్ట్ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు పలకడంతో టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరా? అనేది చర్చనీయాంశంగా మారింది. జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ పేర్లు వినిపిస్తున్నా.. సెలెక్టర్లు విరాట్ కోహ్లీవైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రాకు సారథ్య బాధ్యతలు దక్కాల్సింది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ గైర్హాజరీలో బుమ్రా.. అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ పర్యటనలో 32 వికెట్లు తీసి కెప్టెన్సీ బాధ్యతలు తన ప్రదర్శనకు అడ్డంకి కాదని నిరూపించుకున్నాడు. సారథిగా ఉంటే మరింత మెరుగ్గా రాణిస్తానని చాటి చెప్పాడు. కానీ బౌలర్‌గా ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టే క్రమంలో వెన్ను గాయానికి గురై జట్టుకు దూరమయ్యాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడలేకపోయాడు.

బుమ్రా ఔట్..
ఈ గాయం నేపథ్యంలో బుమ్రాను లీడర్‌షిప్ గ్రూప్ నుంచి తప్పించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పించేందుకు సిద్దమయ్యారని వార్తలు వచ్చాయి. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రా.. ఇంగ్లండ్ పర్యటనలో 5 టెస్ట్‌లకు ఐదు మ్యాచ్‌లు ఆడలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే అతన్ని లీడర్‌షిప్ గ్రూప్ నుంచి తప్పించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ పేర్లను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.
అనుభవం నేపథ్యంలోనే..
ఐపీఎల్‌లోనూ గుజరాత్ టైటాన్స్‌ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. అయితే సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత జట్టును నడిపించే అనుభవం అతనికి లేదని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అది అతని ఆటపై ప్రభావం చూపనుంది. రిషభ్ పంత్ పరిస్థితి కూడా అదే. ఈ క్రమంలోనే అనుభవం కలిగిన విరాట్ కోహ్లీకే మళ్లీ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలనే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా కోహ్లీ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల చెపట్టేందుకు విరాట్ కోహ్లీ విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం ఇంగ్లండ్ పర్యటన వరకైనా కెప్టెన్‌గా వ్యవహరించాలని కోహ్లీని సెలెక్టర్లు ఒప్పిస్తున్నట్లు సమాచారం.
సక్సెస్‌ఫుల్ టెస్ట్ కెప్టెన్..
టెస్ట్‌ల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్లలో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. అతని సారథ్యంలో భారత్ 68 మ్యాచ్‌లు ఆడి 40 విజయాలు సాధించింది. మరో 11 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. కెప్టెన్‌గా కోహ్లీ టెస్ట్‌ల్లో 5,864 పరుగులు చేశాడు. ఇందులో 20 సెంచరీలతో పాటు 7 డబుల్ సెంచరీలు నమోదు చేశాడు. కోహ్లీ సారథ్యంలో సొంతగడ్డపై 11 టెస్ట్ సిరీస్‌లు గెలిచింది. విదేశాల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గానూ విరాట్ కోహ్లీ రికార్డ్ సాధించాడు. కోహ్లీ సారథ్యంలో విదేశాల్లో భారత్.. 15 విజయాలు నమోదు చేసింది. కోహ్లీ సారథ్యంలో భారత టెస్ట్‌ల్లో నెంబర్ వన్ ర్యాంక్‌ను కూడా సొంతం చేసుకుంది. అరంగేట్ర డబ్ల్యూటీసీ 2021 ఫైనల్ కూడా చేరింది.