
కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. థర్డ్ అంపైర్ ఘోర తప్పిదంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. క్యాచ్ ఔట్ విషయంలో ఫీల్డ్ అంపైర్‌తో పాటు థర్డ్ అంపైర్ చేసిన తప్పిదం భారత కెప్టెన్‌ను కలిసొచ్చింది. దాంతో ఈ అవకాశాన్ని అందుకున్న విరాట్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. దాంతో టీ బ్రేక్ సమయానికి భారత్ 54 ఓవర్లలో 4 వికెట్లకు 141 రన్స్ చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(139 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40 బ్యాటింగ్), రిషభ్ పంత్(30 బంతుల్లో 2 ఫోర్లతో 12 బ్యాటింగ్) ఉన్నారు.
అయితే టీ బ్రేక్ ముందే విరాట్ కోహ్లీకి పెద్ద గండం తప్పింది. ఓలివర్ వేసిన 52వ ఓవర్‌లో కోహ్లీ క్యాచ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఓవర్ నాలుగో బంతిని ఓలివర్ గుడ్ లెంగ్త్‌గా వేయగా.. కోహ్లీ టికిల్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి వెంట్రుకమందంలో బ్యాట్‌ను ముద్దాడుతూ థై ప్యాడ్‌ను తాకి కీపర్ చేతిలో పడింది. దాంతో సౌతాఫ్రికా ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఈ వికెట్‌పై ఆత్మవిశ్వాసంతో ఉన్న సఫారీ ఆటగాళ్లు థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు.
టీవీ రిప్లేలో పలుమార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్.. నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే బ్యాట్‌కు బంతి తాకినట్లు స్నీకో మీటర్‌లో వెంట్రుక మందం సన్నని గీత కనిపించింది. ఆ తర్వాత థై ప్యాడ్‌ను తాకినట్లు తేలింది. దాంతో మూడో అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ నాటౌటిచ్చాడు. బ్యాట్‌కు తాకినట్లు స్పష్టమైన ఆధారం లేదని పేర్కొన్నాడు. అయితే థర్డ్ అంపైర్ నిర్ణయం పట్ల సఫారీ ఆటగాళ్లతో పాటు విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు.
మొత్తానికి అంపైర్ తప్పిదం టీమిండియాకు కలిసొచ్చిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ అవకాశంతోనైనా కోహ్లీ సెంచరీ చేయాలని ఆకాంక్షిస్తున్నారు.